పాలిటిక్స్‌లోకి గాలి రీ ఎంట్రీ వెన‌క అస‌లు సీక్రెట్‌..?

త‌న కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించి దేశ వ్యాప్త జ‌నాల దృష్టినీ ఆక‌ర్షించిన మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న‌రెడ్డి.. మ‌ళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా?  ఇప్ప‌టికే దీనికి సంబంధించి ప్ర‌ముఖ నేత‌ల‌తో ఆయ‌న మంత‌నాలు సాగిస్తున్నారా? త‌నపై న‌మోదైన కేసుల నుంచి బ‌య‌ట‌పడేందుకు, కొత్త‌గా ఏవీ న‌మోదు కాకుండా చూసుకునేందుకు ఆయ‌న రాజ‌కీయాలే శ‌ర‌ణ్య‌మ‌ని భావిస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. మ‌రి అదేంటో చూద్దాం.

క‌ర్ణాట‌క  బీజేపీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించి, త‌న మాట‌కు ఎదురులేద‌ని నిరూపించుకుంటున్న క్ర‌మంలో బ‌ళ్లారి మైనింగ్ ద్వారా దేశ వ్యాప్తంగా వివాదాస్ప‌ద‌మైన పొలిటిక‌ల్ లీడ‌ర్ గాలి జ‌నార్ద‌న రెడ్డి.  క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారిలో ఈయ‌న‌కు కేటాయించిన ప్రాంతంలోనే కాకుండా మ‌రికొంత భాగంలో అ క్ర‌మ తవ్వ‌కాలు జ‌రిపి కోట్లు కూడ‌బెట్టార‌నేది ఈయ‌న‌పై ప్ర‌ధాన అభియోగం. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న క‌ర్ణాట‌క లోకాయుక్త‌.. పెద్ద ఎత్తున విచార‌ణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ గాలిని క‌ట‌క‌టాల్లోకి నెట్టారు.

ఒక‌టి కాదు రెండు కాదు ప‌దుల సంఖ్య‌లో గాలిపై కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో బెయిల్ పొందేందుకు చేసిన మ‌రో ప్ర‌య‌త్నం.. నేరుగా న్యాయ‌మూర్తికి లంచం ఇవ్వ‌డం. ఈ కేసునులోనూ గాలి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక‌, తాజాగా త‌న ఏకైక కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహం నేప‌థ్యంలో ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న ఇన్విటేష‌న్ కార్డు నుంచి ఎండింగ్ వ‌ర‌కు పెళ్లిని ఎంత ఘ‌నంగా చేశారో తెలిసిందే. ప‌త్రిక‌లు స‌హా మీడియా గాలి వారింట పెళ్లిని ప్ర‌ధాన టాపిక్ చేసేసింది. వాస్త‌వానికి చెప్పాలంటే నోట్ల ర‌ద్దు విష‌యమే క‌నుక లేక‌పోయి ఉంటే.. గాలి వారి పెళ్లికి మ‌రింత మీడియా మేక‌ప్ అదిరిపోయేది.

ఇక‌, ఇప్పుడు గాలి తాజాగా పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై దృష్టి పెట్టార‌ని బెంగ‌ళూరు వ‌ర్గాల క‌థ‌నం. ఒక‌ప్పుడు త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుతో ఏమైనా చేయొచ్చ‌ని భావించిన గాలి.. సాక్షాత్తూ.. సీఎం ఎడ్యూర‌ప్ప‌తోనే క‌య్యానికి కాలుద‌వ్వారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు పార్టీ నుంచి ఎలాంటి సాయం అంద‌కుండా పోయింది. దీంతో త‌న త‌ప్పు తెసుకున్న గాలి..  భ‌విష్య‌త్తులో త‌న‌పై కేసులు న‌మోదు కాకుండా, ప్ర‌స్తుత కేసుల విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న సాగేలా చేసేందుకు పాలిటిక్స్‌కు మించిన వేదిక లేద‌ని ఖ‌చ్చితంగా నిర్ణ‌యించుకున్నారు. దీంతోనే ఎడ్డీని మచ్చిక చేసుకున్నారు. అందుకేనేమో.. గాలి వారింట పెళ్లికి వ‌ద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించినా.. ఎడ్డీ మాత్రం ఉత్సాహంగా వెళ్లారు.

ఈ క్ర‌మంలోనే గాలి పొలిటిక‌ల్ రీఎంట్రీపై వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.నిజానికి గాలి వ‌ద్ద డ‌బ్బు కు లోటు లేదు. రాజ‌కీయ పార్టీల‌కు కావాల్సింది కూడా అదే. అయితే, ఆయ‌న‌పై అక్ర‌మ, అవినీతి గ‌నుల ముద్ర ప‌డింది. దీంతో ఆయ‌న‌ను ఏపార్టీ కూడా చేర‌దీసేందుకు భ‌య‌ప‌డే ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సొంత‌గూడు క‌మ‌లద‌ళం తిరిగి ఆయ‌న‌ను చేర్చ‌కుంటున్నారా? అనేది సందేహంగా మారింది. అవినీతిని స‌హించేది లేద‌ని ప‌దే ప‌దే చెబుతున్న ప్ర‌ధాని మోడీ ఇలాంటి వాళ్ల‌ని స్వాగ‌తిస్తే ఊరుకుంటారా? అనేది నూరు డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏం జ‌రుగుతుందో చూడాలి.