ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టేశారా..!

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రితో ప‌నుంటుందో చెప్ప‌లేం! గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ లెవిల్ వర‌కు అంద‌రూ మిత్రులే! అదేస‌మ‌యంలో ఎప్పుడు ఎవ‌రితో అవ‌స‌రం తీరుతుందో కూడా చెప్ప‌లేం. ఇది పాలిటిక్స్‌లో న‌యా ట్రెండ్ అన‌డానికి వీల్లేదు. ఎందుకంటే.. పాలిటిక్స్ అంటేనే అంత కాబ‌ట్టి!! ఈ విష‌యం అంతా ఎందుకంటే.. 2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భారీ ఎత్తున మీడియాలో క‌నిపించిన విద్యాధికుడు, సీనియ‌ర్ నేత ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌.. ఇప్పుడు దాదాపు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న గురించే ఈ స్టోరీ.

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌. త‌నకంటూ ఓన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్య‌క్తి. ఓ ప్ర‌ముఖ టీవీలో చ‌ర్చ‌ల ద్వారా రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌రైన నేత‌. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ నుంచి ప‌ట్టా పొంది.. పాలిటిక్స్‌లోకి ఎంట‌ర్ అయిన ప‌ర‌కాల చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యంలో కొన్నాళ్లు కొన‌సాగారు. అయితే, టికెట్టు అమ్ముకుంటున్నార‌ని, అల్లు అర‌వింద్ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న దాదాపు ఖాళీయే. అయితే, అదేస‌మ‌యంలో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో స‌మైక్యాంధ్ర గ‌ళాన్ని వినిపించారు. అనంత‌రం, ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో అనూహ్యంగా ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా ఆయ‌న కేబినెట్ ర్యాంకు ప‌ద‌విని సంపాయించాయి.

అయితే, ఈ ప‌ద‌విని పొంద‌డం వెనుక ప‌ర‌కాల‌ భార్య కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఉన్నార‌ని అంటారు. అది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలీదు. దీంతో ప్ర‌తి విష‌యాన్నీ ప‌ర‌కాల పెద్ద ఎత్తున మీడియా ముందు ప్ర‌త్య‌క్ష‌మై మాట్లాడేవారు. చంద్ర‌బాబుతో క‌లిసి అనేక విదేశీ టూర్లు కూడా చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న హ‌వా దాదాపు త‌గ్గిపోయింది. ముఖ్యంగా ఏపీ స‌మాచార పౌర‌సంబంధాల శాఖకు కొత్త క‌మిష‌న‌ర్‌గా ఎస్‌. వెంకటేశ్వ‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ప‌ర‌కాల‌కు ప‌నిలేక‌పోయింద‌నే టాక్ వ‌స్తోంది.

అందుకే, ప‌ర‌కాల‌ ఈ మ‌ధ్య వెల‌గ‌పూడిలో కూడా ఎక్కువ‌గా ఉండ‌టం లేద‌ట‌. ఏపీ ఉద్యోగులంద‌రూ హైద‌రాబాద్ నుంచి వెల‌గ‌పూడికి వెళ్తుంటే… ఆయ‌న మాత్రం అక్క‌డి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసి  ఉంటున్నార‌ట‌. మొత్తానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండుళ్ల‌న్న‌రేళ్ల‌లోనే త‌న ప‌రిస్థితి దిగ‌జారుతుంద‌ని ఆయ‌న ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు అని ప‌ర‌కాల‌పై కామెంట్లు వ‌స్తున్నాయి. దీంతో త్వ‌ర‌లోనే ప‌ర‌కాల టీడీపీకి, చంద్ర‌బాబుకి క‌టీఫ్ చెప్పి బ‌య‌ట‌కు వచ్చేస్తారేమోన‌నే సందేహాలూ వ‌స్తున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.