పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న జ‌గ‌న్‌…

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు, నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు అవినాభావ సంబంధం ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2003లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర‌వ్యాప్తంగా  దాదాపు 1600 కిలోమీట‌ర్ల దూరం చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను తేవ‌డ‌మే కాదు… ఆనాటికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇత‌ర నేత‌లంద‌రినీ వైఎస్ ముందు మ‌రుగుజ్జులుగా మార్చేసి ఆయ‌న‌ను ఏకంగా సీఎం పీఠం ఎక్కించేసింది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఆరుప‌దులు దాటిన వ‌య‌సులో చేసిన పాద‌యాత్ర.. టీడీపీ బ‌ల‌ప‌డేందుకు, ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంత‌గా స‌హ‌క‌రించిందో అంద‌రికీ తెలిసిందే.

కాగా ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్‌రెడ్డి కూడా అదే బాట‌లో.. త‌న పార్టీని అధికార పీఠం ద‌రిచేర్చేందుకు పాదయాత్ర బాట పట్టనున్నాడా?  అంటే  అవున‌న్న స‌మాధాన‌మే రాజ‌కీయ‌ వ‌ర్గాల నుంచి విన‌వ‌స్తోది.  హఠాత్తుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేత‌లు మాత్రం ఇంకా బ‌హిరంగంగా ఏమీ మాట్లాడ‌టం లేదు.

ఈ అంశంపై  జ‌గ‌న్‌గానీ ఆయ‌న పార్టీ ప్ర‌తినిధులు కానీ ఇంకా ఏమీ ప్ర‌క‌టించ‌క‌పోయినా జ‌గ‌న్ ఈ విష‌యంపై తీవ్రంగానే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.  నిజానికి జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చాలాకాలం క్రిత‌మే ఈ ర‌క‌మైన యాత్ర‌కు సిద్ధ‌మైనా.. ఆయ‌న అరెస్టు త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో దానిని జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కొన‌సాగించారు. అయితే ఈ యాత్ర‌తో వైఎస్ కుటుంబం ఆశించిన ఫ‌లితాలు మాత్రం త‌ద‌నంత‌ర కాలంలో ఏమంత క‌నిపించ‌లేదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ 2019 ఎన్నిక‌ల్లో విజ‌యమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నాడనే వార్త‌లు తాజాగా వినిపిస్తున్నాయి.  ఏపీకి ప్రత్యేకహోదా అంశం పై సొంత పార్టీ ఎంపీలంద‌రి చేత రాజీనామా చేయించి, ఆ త‌ర్వాత‌ జగన్ అదే అజెండాతో పాదయాత్ర చేపట్టి ప్ర‌జ‌ల్లో త‌న‌కూ పార్టీకి మైలేజీ పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేసే అవకాశాలున్నాయట. మొత్తం మీద పాద‌యాత్ర రాజ‌కీయాలు రాష్ట్రాన్ని మ‌రోసారి వేడెక్కించే అవ‌కాశం క‌నిపిస్తోంది.