టీడీపీ కంచుకోట‌పై జ‌న‌సేన గురి

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తీసుకున్న నిర్ణ‌యం ఏపీ పాలిటిక్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ప‌వ‌న్ కేవ‌లం ఓటు హ‌క్కు మాత్ర‌మే ఏలూరులో న‌మోదు చేయించుకున్న‌ట్టు పైకి క‌నిపించినా దీని వెన‌క అనేక రాజ‌కీయ కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ ఏలూరు నివాసం ఉండేందుకు త‌న‌కు అనువైన భ‌వ‌నం చూడాల‌ని కూడా కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఈ వ్యూహం వెన‌క టీడీపీ కంచుకోట‌ను టార్గెట్ చేసినట్టు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

టీడీపీ ఆవిర్భావం నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. 1994, 1999 ఎన్నిక‌ల్లో ఒక్క సీటు మిన‌హా అన్ని సీట్లు గెలుచుకున్న టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసేసింది. గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజిక‌వ‌ర్గ ప్రాబ‌ల్యం బ‌లంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో మెగా ఫ్యామిలీ ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ అభిమానులు ల‌క్ష‌ల్లో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇదే జిల్లాలోని పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేస్తార‌న్న ప్రచారం రెండు రోజులుగా జిల్లాలో ఊపందుకుంది.

ప‌వ‌న్ పాల‌కొల్లు నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ ఈ రెండు జిల్లాల‌పై త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పవన్‌ ఒంటరిగా రంగంలోకి దిగితే జిల్లాలోని అన్ని సీట్లపై ఆ ప్రభావం పడుతుందన్న టాక్ వ‌స్తోంది. అదే జ‌రిగితే ఇక్క‌డ 15 సీట్ల‌లో గెలిచి తిరుగులేని అధికారం చెలాయిస్తోన్న టీడీపీకి త‌ప్ప‌కుండా ఎఫెక్ట్ ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. 2009లో చిరు ప్ర‌జారాజ్యం స్థాపించిన‌ప్పుడు జ‌రిగిన ట్ర‌యాంగిల్ ఫైట్‌లో కూడా టీడీపీ ఈ రెండు జిల్లాల్లో ఘోరంగా దెబ్బ‌తింది. దీంతో జ‌న‌సేన సొంతంగా పోటీ చేస్తే మ‌రోసారి టీడీపీకి దెబ్బ ప‌డ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ప్ర‌ధాన‌మంత్రి మోడీ, సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి భీమ‌వ‌రం బ‌హిరంగ స‌భ‌లో కూడా పాల్గొన్నారు. ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఈ కూట‌మికి ఎంతైనా హెల్ఫ్ అయ్యింది. ఫ‌లితంగా టీడీపీ 15 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్ల‌తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక తాజాగా జిల్లాలో అక్వా ఫుడ్ పార్క్ ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ గ‌ళం విప్ప‌డం, ఇక్క‌డే త‌న ఓటు హ‌క్కు న‌మోదు చేయించుకోవ‌డంతో పాటు ఇదే జిల్లాలోని పాల‌కొల్లు నుంచే పోటీ చేస్తార‌న్న వార్త‌లు ఇప్పుడు మిగిలిన రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

పాల‌కొల్లు బ‌రిలోకి దిగేందుకు రెడీ అవుతోన్న ప‌వ‌న్ ఇప్ప‌టికే చాప‌కింద నీరులా త‌న కార్య‌క్ర‌మాలు అక్క‌డ విస్త‌రిస్తున్న‌ట్టు కూడా జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మేర‌కు క్లీన్ ఇమేజ్ ఉన్న ఓ యువ‌కుడికి అక్క‌డ బాధ్య‌తలు అప్ప‌గించేందుకు కూడా రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప‌వ‌న్ తాజా డెసిష‌న్ గోదావ‌రి జిల్లాల టీడీపీ నాయ‌కుల గుండెళ్లో రైళ్లు ప‌రిగిత్తిస్తోంది.