టీఆర్ఎస్‌లో కొత్త క‌ల‌రింగ్ చూస్తే షాకే

అవును! తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కి కొత్త క‌ల‌రింగ్ ఇవ్వ‌బోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్‌. 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఆయ‌న అనేక సంచ‌న‌ల నిర్ణ‌యాల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంపై త‌న ముద్ర ప‌డేలా జిల్లాల ఏర్పాటు చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వ చేయాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు, పార్టీ కేడ‌ర్ స‌హా మంత్రులు, నేత‌లు అంద‌రూ నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేలా ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. వాస్త‌వానికి నిత్యం వార్త‌ల్లో ఉంటున్న సీఎం ఎవ‌రంటే ఒక్క ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మేన‌ని ఠ‌క్కున జ‌వాబు వ‌స్తుంది. మీడియాకీ, ఆయ‌న‌కి అంత‌గా అవినాభావ సంబంధం ఉంది.

ఏదో ఒక కార‌ణంలేదా ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ఆయ‌న మీడియాతో డైలీ ట‌చ్‌లోనే ఉంటారు. అంతేకాదు, ఆయ‌న టీం కూడా నిత్యం మీడియాతో ట‌చ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను కేసీఆర్ అనుస‌రించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కో రెండు నెల‌ల‌కో టీఆర్ ఎస్ భ‌వ‌న్ ముఖం చూసే నేత‌ల‌ను ఇక‌పై దానికే ప‌రిమితం చేయాల‌ని , నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం, ప్రెస్ మీటో, చ‌ర్చ‌లో జ‌రిగేలా, లేదా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేలా చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్ భ‌వ‌న్ ఏదైనా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ప్పుడో లేదా ఎవ‌రైనా పార్టీలో చేరిన‌ప్పుడో మాత్ర‌మే క‌ళ‌క‌ళ లాడుతోంది. ఇక‌, సీఎం కేసీఆర్ ఈ భ‌వ‌న్‌కి రావ‌డం అంటే నెలో రెండు నెల‌లో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌రోప‌క్క‌, కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు నిత్యం మీడియాలో ఉంటున్నారు. ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని తీసుకుని వారు ప్ర‌భుత్వాన్ని ఏకేస్తున్నారు. దీంతో వీరికి చెక్ పెట్ట‌డంతో పాటు ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా కేసీఆర్ పాల‌న విశేషాలు చేరాల‌ని సీఎం ప‌క్కాగా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో డిసెంబ‌రు నుంచి టైమ్ యాక్టివిటీ అంతా టీఆర్ ఎస్ భ‌వ‌న్‌లోనే జ‌రిగేలా ప్లాన్ చేస్తున్నారు.

 ప్రతీ రోజు ఒక మంత్రి పార్టీ ఆఫీసులో ఉండేలా చూడాల‌ని భావిస్తున్న‌ర‌ట‌. ఎమ్మెల్యేలు, నాయ‌కులు కూడా రోజంతా పార్టీ ఆఫీస్‌లో ఉండేలా కూడా సీఎం ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ట‌. కేవలం మంత్రులే కాకుండా నెల‌కోరోజు కేసీఆర్ సైతం పార్టీ ఆపీస్‌కు రావాల‌ని నిర్ణయించున్నారని సమాచారం. నెల రోజుల్లో జిల్లా క‌మిటీలు, నామినేటెట్ ప‌దవులు భ‌ర్తీ చేయ‌నున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవ‌ర్గాన్ని, పొలిట్‌బ్యూరోను త్వర‌లోనే ప్రక‌టిస్తారని తెలుస్తోంది. పార్టీని హైటెక్ హంగుల‌తో అభివృద్ది చేసి శిక్షాణా త‌రగ‌తులు కూడా భ‌వ‌న్‌లోనే నిర్వహించనున్నారు. సీనియ‌ర్లకు బాధ్యత‌లు అప్పగించి నిత్యం పార్టీ ఆఫీస్‌లో ఉండేలా కార్యకలాపాలు రూపొందించాలని కేసీఆర్ ఆలోచ‌న. నేతలకు జిల్లాలు కేటాయించ‌నున్నారు. సో.. ఇలా సీఎం కేసీఆర్‌.. టీఆర్ ఎస్‌కి కొత్త క‌ల‌రింగ్ ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి కేసీఆర్ వ్యూహాన్ని కాంగ్రెస్‌, టీడీపీలు  ఎలా త‌ట్టుకుంటాయో చూడాలి.