క‌మ‌ల్‌కు గౌత‌మి గుడ్‌బై

న‌టుడిగా క‌మ‌ల్‌హాస‌న్ స్థాయి ఎలాంటిదో ప్ర‌త్యేకంగా ఇప్ప‌డు చెప్పుకోన‌వ‌స‌రం లేదు.  త‌న అస‌మాన న‌ట‌న‌తో విశ్వ‌న‌టుడిగా పేరొందిన క‌మ‌ల్‌హాస‌న్ దేశ‌వ్యాప్తంగానే కాదు. విదేశాల్లోనూ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సినిమారంగంలో ప‌రిపూర్ణ న‌టుడిగా పేరొందిన క‌మ‌ల్ వైవాహిక‌ జీవితం మాత్రం ఒడిదుడుకుల‌మ‌యంగానే సాగుతూ రావ‌డం అంద‌రికీ తెలిసిందే.  క‌మ‌ల్  న‌ట‌న‌ను ఎంత‌గానో ప్రేమించే  అభిమాన తీవ్ర‌వాదులు కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త  జీవితం విష‌యంలో మాత్రం అత‌డిని ఎంత‌మాత్రం ఆద‌ర్శంగా తీసుకోవాల‌నుకోరు.

ఇంత‌కీ విష‌యేమిటంటే న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌తో సుమారు 13 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న‌గౌత‌మి ఇక తాము విడిపోవాల‌నుకుంటున్న‌ట్టు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గౌత‌మి త‌న బ్లాగ్‌లో త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తూ క‌మ‌ల్ హాస‌న్‌తో ఇక తాను ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేన‌న్న స‌త్యం త‌న హృద‌యాన్ని చిదిమేస్తున్న‌ద‌ని, ఇది త‌న జీవితంతో తీసుకున్న అత్యంత భ‌యంక‌ర నిర్ణ‌య‌మ‌ని ఆమె పేర్కొంది.   ‘కమిటెడ్‌ రిలేషన్‌ షిప్‌లో మన ఆశ‌లు, క‌ల‌లు ముఖ్యమని అనుకోవడమా, లేక జీవితంలో ఎదుర‌య్యే య‌థార్థ ప‌రిస్థితుల‌తో రాజీ పడడమా అని తేల్చుకోవడం ఎవరికీ ఏమంత సులువైన‌ పనికాదు. హృదయం బద్దలయ్యే ఈ నిజం అంగీకరించడానికి, ఈ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది’ అంటూ గౌత‌మి త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ ఒక్క‌సారిగా షాక్ కు  గురిచేసింది.

ఎవ‌రినో తప్పుపట్టడ‌మో లేక సానుభూతి పొందడమో త‌న ఉద్దేశం కానేకాద‌ని , జీవిత స‌త్యాల్నిగ్ర‌హించాక‌.. మార్పు అనేది మానవ సహజ‌మ‌ని అంగీక‌రించ‌క త‌ప్ప‌ద‌ని గౌత‌మి పేర్కొంది. తాను మొదట తల్లిన‌ని, ఇక‌పై సాధ్యమైనంత వరకు త‌న‌ బిడ్డకు మంచి త‌ల్లిగా ఉండ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని కూడా గౌత‌మి చెప్పింది.  ఇక తాను చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్ట‌క‌ముందు, న‌టిగా మారిన త‌రువాత కూడా కమల్‌కు పెద్ద అభిమానినేన‌న్న విష‌యంలో ర‌హ‌స్యమేమీ లేద‌ని గౌత‌మి త‌న‌ లేఖ‌లో చెప్పుకొచ్చింది.

కమల్‌హాసన్‌, గౌతమి క‌లిసి  అపూర్వ సహోదరగళ్‌, దేవ‌ర్‌ మగన్‌, పాపనాశం వంటి త‌మిళ చిత్రాల్లో క‌లిసి న‌టించారు. ఇవి తెలుగులో అనువాద చిత్రాలుగా వ‌చ్చి ఇక్క‌డా మంచి విజ‌యాల‌నే అందుకున్నాయి. కాగా  తాజాగా కమల్‌ నటిస్తున్న ‘శభాష్‌నాయుడు’  సినిమా చిత్రీకరణ సందర్భంగా కమల్‌ కుమార్తె  శృతిహాసన్‌, గౌతమిల మధ్య విబేధాలు నెల‌కొన్న‌ట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శృతి వస్త్రధారణ, పాత్ర తదితర విషయాల్లో గౌతమి కల్పించుకోవడం క‌మ‌ల్ కూతురికి నచ్చలేదని దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య అది వివాదంగా మారింద‌ని తెలుస్తోంది.

అయితే ఆతరువాత శృతిహాసన్‌ వీటిపై వివరణ  ఇస్తూ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని అదంతా మీడియా సృష్టేన‌ని స్పష్టం  చేసింది. కాగా ఇదే స‌మ‌యంలోగౌత‌మి క‌మ‌ల్‌తో విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం మ‌ద్రాసు సినీవ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపింది. క‌మ‌ల్ త‌న మొద‌టి భార్య వాణితో విడిపోయిన త‌రువాత హిందీన‌టి సారిక‌ను వివాహమాడిన విష‌యం తెలిసిందే. న‌టి శృతిహాస‌న్‌, అక్ష‌ర‌హాస‌న్ వారి సంతానమే.. అయితే అనంత‌ర కాలంలో సారిక క‌మ‌ల్‌నుంచి విడిపోయింది. ఇక ఆ త‌ర్వాత గౌత‌మితో క‌మ‌ల్ స‌హ‌జీవ‌నం చేస్తూ వ‌చ్చారు.