బాబు గ్రేడింగుల‌పై మండిప‌డుతున్న గుంటూరు ఎమ్మెల్యేలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల త‌న పార్టీ నేత‌లు స‌హా మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరుపై నిర్వ‌హించిన స‌ర్వే ఇప్పుడు దుమారం రేపుతోంది. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో ఎమ్మెల్యేలు ఒక‌రిపై ఒక‌రు మండిప‌డుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు, నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో వారు మ‌మేకం అవుతున్న‌తీరు, వారి కుటుంబ స‌భ్యుల వ్య‌వ‌హార శైలి, పార్టీకి వాళ్లు కేటాయిస్తున్న స‌మ‌యం వంటి ప‌లు అంశాల‌పై చంద్ర‌బాబు నిఘా స‌ర్వే చేయించారు. దీని ఆధారంగా వాళ్ల‌కి గ్రేడ్‌లు కూడా కేటాయించారు. ఏబీసీడీ గ్రేడ్‌ల‌ను ఇచ్చారు. గ‌త నెల‌లో విజ‌య‌వాడ స‌మీపంలో నిర్వ‌హించిన పార్టీ శిక్ష‌ణ శిబిరం ఆఖ‌రిరోజున స‌ర్వే నివేదిక‌ల‌ను ఎమ్మెల్యేలు మంత్రులకు సీల్డ్ క‌వ‌ర్ల‌లో అందించారు.

ఇక‌, ఈ స‌ర్వే వివ‌రాలు తెలుసుకున్న ఎమ్మెల్యేలు అవాక్క‌య్యారు. ముఖ్యంగా గుంటూరులోని కొంద‌రు ఎమ్మెల్యేల‌కు ఏ, బీ గ్రేడ్‌లు రావ‌డం, మ‌రికొంద‌రికి సీ, డీ గ్రేడ్‌లు రావ‌డంతో పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం రేగుతోంది. ఏ, బీ గ్రేడ్‌లు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కన్నా తాము ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని సీ, డీ గ్రేడ్ వ‌చ్చిన ఎమ్మెల్యేలు విరుచుకుప‌డుతున్నారు. వాస్త‌వానికి ఈ గ్రేడ్‌ల విష‌యాలు బ‌య‌ట‌కు పొక్క‌రాద‌ని అధినేత చంద్ర‌బాబు వారిని ఆదేశించారు. అయిన‌ప్ప‌టికీ.. అవి ఒక‌రి నుంచి ఒక‌రికి లీక‌వ‌డంతో ఈ వివాదం పెరిగింది.

ముఖ్యంగా గ‌త కొన్నాళ్లుగా భూములు, గ‌నుల‌కు సంబంధించి తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారికి బాబు స‌ర్వేలో ఏ, బీ గ్రేడ్‌లు వ‌చ్చాయి. వీటిపైనే టీడీపీ మిగ‌తా ఎమ్మెల్యేలు ఫైరైపోతున్నారు. తెనాలి, గుర‌జాల ఎమ్మెల్యేల వ్య‌వ‌హార శైలిపై ఆది నుంచి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొన్నామ‌ధ్య వైకాపా మాచ‌ర్ల ఎమ్మెల్యే, టీడీపీ గుర‌జాల ఎమ్మెల్యేలు బ‌హిరంగ చ‌ర్చ‌ల‌కు దిగ‌డం, పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు తెర‌దీయ‌డం జ‌రిగింది. అయితే, గుర‌జాల ఎమ్మెల్యేకి ఏ, బీ గ్రేడ్‌లో ఒకటి రావ‌డంతో సీ,డీ గ్రేడ్ వ‌చ్చిన ఎమ్మెల్యేలు దీనినే ప్ర‌శ్నిస్తున్నారు. తాము ఎంతో ప్ర‌శాంతంగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నామ‌ని, అవినీతి జోలికిపోవ‌డం లేద‌ని అయిన‌ప్ప‌టికీ త‌మ‌కు సీడీ గ్రేడ్‌లు ఇవ్వ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

గుంటూరు-2 ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డికి ‘బి’ గ్రేడ్‌ వచ్చిన మాటలో నిజం లేదని, ఆయనకు ‘సి’ కానీ ‘డి’ కానీ వచ్చి ఉంటుందని ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే వివాదా భూముల విషయంలో కలుగ చేసుకుంటూ కోట్లు గడించడమే కాకుండా, భూ ఆక్రమణలకు కూడా ప్రోత్సహిస్తున్నారని ఇంతకు ముందు విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనకు ‘ఎ’ గ్రేడ్‌ ఇవ్వడమేమిటని కొంత మంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన వివరాలను కంప్యూటర్‌లో చేర్చి వెంటనే సమాధానాలు పంపితే ఎ,బి గ్రేడ్‌లు ఇస్తారా…? ఇది న్యాయమా…ఈ గ్రేడ్‌లపై పున:సమీక్ష చేయాలని, నిజాయితీపరులైన ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటేవారికి గ్రేడ్‌లు సవరించాలని వారు కోరుతున్నారు. మ‌రి ఈ త‌మ్ముళ్ల వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.