ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై లోకేష్ కామెంట్స్‌

అనంత‌పురంలో నిర్వ‌హించిన స‌భ‌లో జ‌న‌సేనాని ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, చంద్ర‌బాబు పాల‌న‌పై పెద్ద ఎత్తున సైలెంట్‌గానే విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్యంగా హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీ ముద్ద‌ని అంటున్న బాబు అండ్‌కోపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. కేవ‌లం ప‌న్నల రూపంలో ఏపీకి ఏం రావాలో వాటినే ఓ ప్యాక్ చేసి.. దానికి ప్యాకేజీ అని పెద్ద పేరు పెట్టి.. మ‌న మొహాన కొట్టార‌ని కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్‌.. దానిని చంద్ర‌బాబు ఎలా ఆహ్వానించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో ప్యాకేజీ తెచ్చామంటూ కొంద‌రు హీరోల్లా మాట్లాడుతుంటే… వారికి ఎలా స‌న్మానాలు చేస్తార‌ని కూడా ప్ర‌శ్నించారు.

ఇక‌, ఏపీలో అధికార ప‌క్షం అవినీతి తార‌స్థాయికి చేరిపోయింద‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయ‌ని కూడా ప‌వ‌న్ అన‌డం గ‌మ‌నార్హం. అవినీతిపై ప్ర‌జ‌లు అంటున్నార‌ని చెబుతూనే ప‌వ‌న్ ఓ స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఇక‌, ఈ విమ‌ర్శ‌ల‌పై గురువారం రాత్రే స్పందించిన చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. లోకేష్‌.. ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు త‌న‌తో మీట్ అయిన టీడీపీ నాయ‌కుల‌తో అన్న‌ట్టు తెలుస్తోంది. త‌న అనుచ‌రులు స‌హా ఒక‌రిద్ద‌రు టీడీపీ నేత‌ల‌తోనూ లోకేష్ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చించార‌ట‌.

ఈ క్ర‌మంలోనే లోకేష్ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను యాంటీగా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న‌తో మ‌న‌కు విభేదాలు లేవ‌ని కూడా టీడీపీ ప‌రివారానికి హిత‌బోధ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంపై ఎవ్వ‌రూ స్పందించ‌వ‌ద్ద‌ని కూడా లోకేష్ ఆదేశాలు జారీ చేసిన‌ట్టు టాక్‌.

హోదా రాద‌ని తెలిసి.. దానికోసం ఎంతో ప్ర‌య‌త్నించి కూడా చివ‌రికి ప్యాకేజీకి మొగ్గు చూప‌డంలో ఉన్న క‌ష్టాన్ని.. వివ‌రించాల‌ని శ్రేణుల‌ను ఆయ‌న కోరారు. ఇక‌, ప్ర‌భుత్వ అవినీతి విష‌యంపైనా అంత‌ర్గ‌తంగా చ‌ర్చించి చర్య‌లు తీసుకుందామ‌ని, బ‌హిరంగంగా ప‌వ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌రాద‌ని కూడా లోకేష్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ప‌వ‌న్ కామెంట్ల‌ను పాజిటివ్‌గానే తీసుకోవాల‌ని ఆయ‌న సూచించ‌డం గ‌మ‌నార్హం.