అమ‌రావతికి చిల్ల‌ర క‌ష్టాలు

పెద్ద నోట్ల క‌ష్టాలు ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌కు కొత్త క‌ష్టాలు తెచ్చిపెట్టాయి. ఇప్ప‌టికే స‌రైన వ‌స‌తులు లేక నానా తిప్ప‌లు ప‌డుతూ విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు నోట్ల క‌ష్టాలు ప‌ట్టుకున్నాయి. చేతిలో వేల కొద్దీ నోట్లు ఉన్నా.. చిల్ల‌ర ఇచ్చే దిక్కులేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వాస్త‌వానికి కొత్త‌గా క‌ట్టిన స‌చివాల‌యం ఇటు గుంటూరు ప్ర‌ధాన న‌గ‌రానికి, అటు విజ‌య‌వాడ కేంద్రానికి సుదూరంలో ఉంది. దీంతో ఉద్యోగుల‌కు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా ఇబ్బందులే. ఇప్పుడు పెద్ద నోట్ల ర‌ద్దుతో వాటిని మార్చుకుంటేనేగానీ టీ చుక్క కూడా గొంతు దిగడం లేదు.

స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో రెండు ప్ర‌ధాన బ్యాంకులు ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ త‌మ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. అయితే, ఆయా బ్రాంచ్‌ల‌కు కొత్త నోట్లు ఇంకా రాలేదు. దీంతో ఉద్యోగులు త‌మ వ‌ద్ద ఉన్న‌ పాత నోట్ల‌ను మార్చుకునేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక‌, బ్యాంకుల్లో కేవ‌లం వంద నోట్లే ఉన్నాయి. దీంతో ఉద్యోగులుకు కేవ‌లం 500 వ‌ర‌కు మాత్ర‌మే చిల్ల‌ర ఇస్తున్నారు. మ‌రో వైపు స‌చివాలయంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లో నూ పెద్ద నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. త‌మ వ‌ద్ద చిల్ల‌ర లేద‌ని అన‌డంతోపాటు, మీరు పెద్ద నోట్లు ఇస్తే.. మేం మార్చుకోవాలి మాకు ఈ ప‌రిణామం మ‌రింత ఇబ్బంది అని వాళ్లు త‌ప్పించుకుంటున్నారు.

దీంతో ప్ర‌పంచ ప్ర‌శిద్ధ న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని భావిస్తున్న అమ‌రావ‌తిలో ఉద్యోగులు మాత్రం చిల్ల‌ర క‌ష్టాలు ప‌డుతున్నారు. రాజధాని ప్రాంతంలోని రైతుల కూడా పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి చిల్లర అడుగుతున్నారు. వారు కూడా నోట్లు రాలేదని చెప్పడంతో,..చేసేది లేక వెనుదిరుగుతున్నారు. మరికొంత మంది తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు..ప్రస్తుతానికి డిపాజిట్ చేస్తే,.ఆ తర్వాత కొత్తనోట్లు తీసుకోవచ్చని భావిస్తున్నారు.