ఆడ‌పిల్ల‌ల‌పై కేసుల్లేవ్ అంటోన్న ప‌వ‌న్‌

స‌మాజంలోని ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ ఎంత బాధ్య‌త‌గా ఉండాలో జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆడ‌పిల్లా ఎంతో గౌర‌వంగా బ‌తికే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని, అదేస‌మ‌యంలో త‌న‌పై ఏదైనా దాడి జ‌రిగితే.. ఆడ‌పిల్ల‌లే ధైర్యంగా తిర‌గ‌బ‌డాల‌ని కూడా ఆయ‌న సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం గుత్తిలోని ఓ విదాసంస్థ‌లో విద్యార్థినుల‌తో ప‌వ‌న్ ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆడ‌పిల్ల‌ల‌కు స‌మాజంలో ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, ఎలా జీవించాలో కూడా వారికి చెప్పుకొచ్చారు.

 

స‌మాజంలో అంద‌రికీ జీవించే హ‌క్కు ఉంద‌ని, ఎవ‌రూ ఎక్కువ‌, ఎవ‌రూ త‌క్కువ కానేకార‌ని ప‌వ‌న్ అన్నారు. మొదట మనం మనుషులుగా పుట్టామని, ఆ తర్వాతే కులం, మతమని అన్నారు. ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల విష‌యంలో స‌మాజంలో వారికి భ‌రోసా ఉండాల‌ని అన్నారు. అర్థ‌రాత్రి వేళ‌లో కూడా ఆడ‌పిల్ల‌లు ధైర్యంగా ఇంటికి వెళ్లే ప‌రిస్థితి రావాల‌ని ప‌వ‌న్ సూచించారు. ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబంలో ఎదురైన ఓ సంఘ‌ట‌న‌ను ఆయ‌న విద్యార్థినుల‌కు వివ‌రించారు. తాను ఆరో తరగతి చ‌దువుతున్న స‌మ‌యంలో త‌న అక్క‌ను ఏడిపించిన వ్య‌క్తిని  చంపేద్దామనుకున్నానని పవన్ చెప్పారు.

 

తాను చిన్నప్పుడు అక్కా చెల్లెళ్ల‌తో పెరిగానని, పిన్నితో ఎక్కువగా మాట్లాడేవాడినని, అందుకే ఆడవాళ్లతో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకున్నానని పవన్ తెలిపారు. తన తండ్రి పోలీస్ అయినప్పటికీ ఒక రౌడి తన అక్కను రోడ్డు మీద లాక్కెళ్లాడ‌ని, అప్పుడు అక్క ఏడుస్తూ వచ్చిందని  ఆ సమయంలో తన అక్కయ్యను ఏడిపించిన వాడిని చంపేద్దామన్నంత కోపం వచ్చిందన్నారు. పోతే జైలుకు పోతా అంతకు మించి ఏమీ కాదు కదా అనుకున్నానన్నారు. రోడ్డు మీద అంత మంది జనం ఉన్నా ఎవరూ మాట్లాడలేదన్నారు.ఒక్కడు లాక్కెళుతుంటే వాడిని ఏమీ చేయలేకపోయారని నిప్పులు చెరిగారు.

 

ప్ర‌తి ఒక్క‌రిలోనూ మ‌నోధైర్యం ఉండాల‌ని సూచించారు. అది ఉంటే ప్ర‌శ్నించే త‌త్వం వ‌స్తుంద‌ని అన్నారు. ఆడ‌పిల్ల‌లు త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ప్ర‌శ్నించాల‌ని, ఎదురు తిర‌గాల‌ని, త‌మ‌కు ఇబ్బంది క‌లిగించే వాళ్ల‌ని.. చెప్పుతో కొట్టాల‌ని అన్నారు. ఆడ‌పిల్ల‌లు కొడితే కేసులు కూడా ఉండ‌వ‌ని తెలిపారు. ఆడ‌పిల్ల‌ల‌కు చ‌ట్టం ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో త‌న‌ను కూడా ప్ర‌శ్నించ‌వ‌చ్చ‌ని ప‌వ‌న్ సూచించ‌డం గ‌మ‌నార్హం.