నారాయ‌ణ‌మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్‌

ఉద్య‌మ సూరీడు, విప్ల‌వ మూవీల డైరెక్ట‌ర్ ఆర్ నారాయ‌ణ మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే, ఇప్పుడు కాదులేండి! గ‌తంలో.. అయితే, తాను పాలిటిక్స్‌కి ప‌నికిరాన‌నే ఉద్దేశంతో ఆయ‌న ఇచ్చిన ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు నారాయ‌ణ మూర్తి చెప్పారు. అంతేకాదు, ఈ ఆఫ‌ర్ ఒక్క‌సారి కాద‌ట‌.. చంద్ర‌బాబు ఇప్ప‌టికి మూడు సార్లు ఎంపీ సీటు ఆఫ‌ర్ ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు నారాయ‌ణ మూర్తి. ఇటీవ‌ల ఆయ‌న ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కాకినాడ పార్ల‌మెంటు స్థానం నుంచి త‌న‌ను పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు గ‌తంలో కోరార‌ని చెప్పారు. అయితే, త‌న‌కు, రాజ‌కీయాల‌కు ప‌డ‌ద‌ని, అందుకే సున్నితంగా తిర‌స్క‌రించాన‌ని తెలిపారు.

ఇక‌, గ‌తంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా త‌న‌కు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశార‌ని నారాయ‌ణ మూర్తి చెప్పారు. ఆయ‌న కూడా తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నుంచి పోటీ చేయాల‌ని కోరిన‌ట్టు తెలిపారు. అయినా తాను ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్టు చెప్పారు. ఇక‌, ప్ర‌స్తుత పాలిటిక్స్‌పై నారాయ‌ణ మూర్తి.. త‌న‌దైన శైలిలో కామెంట్లు కుమ్మ‌రించారు. రాజ‌కీయాలు క‌లుషితం అయిపోయాయ‌ని, విలువ‌లు లేవ‌ని, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. తాజాగా పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో ఎలాంటి ఎక్స‌ర్ సైజ్ జ‌ర‌గ‌లేద‌ని, దీంతో పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లు నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ని చెప్పారు.

ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర మోడీ ఇచ్చిన న‌ల్ల‌ధ‌నం హామీ ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌లేద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య‌మంలో న్యాయం ఉంద‌న్నారు. అందుకే తాను ఆ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు నారాయ‌ణ మూర్తి చెప్పారు. త‌న సింపుల్ సిటీ గురించి మాట్లాడుతూ.. త‌న‌కు రిచ్‌గా ఉండ‌డం ఇష్టం ఉండ‌ద‌ని చెప్పారు. తాను ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు. అందుకే షేర్ ఆటోలు, ఆర్టీసీ బ‌స్సుల్లోనే ప్ర‌యాణాలు చేస్తాన‌ని, కాలి న‌డ‌క‌నే వెళ్లడం త‌న‌కు ఎంతో హాయిగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

అయితే, మూవీలు నిర్మించి, డైరెక్ట్ చేసి.. తాను కోట్లు పోగేసుకుంటున్న‌ట్టు అనుకుంటార‌ని, అయితే, త‌న‌కు ఓ చాప‌, దిండు త‌ప్ప ఎలాంటి ఆస్తులూ లేవ‌న్నారు. అయితే, తాను ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని దానిని డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్టు నారాయ‌ణ మూర్తి చెప్పారు. అయితే, తాను ప‌బ్లిసిటీకి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌న‌ని చెప్పారు. విదేశీ సంస్కృతులు మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని.. చెబుతూ.. విశాఖ‌లో నిర్వ‌హించ‌నున్న బీచ్ ఫెస్టివ‌ల్‌ను నారాయ‌ణ మూర్తి త‌ప్పుప‌ట్టారు.