టీఆర్ఎస్ సంబ‌రాల‌కు మోడీ షాక్‌

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌ధాని మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా జ‌నాల్ని నానాతిప్ప‌లు పెడుతున్న విష‌యం తెలిసిందే. అదికూడా ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో జ‌నాలు మ‌రింత‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక‌, ఈ స‌మ‌స్య‌ల మాటేమో కానీ, తెలంగాణ ప్రభుత్వానికి ఈ నోట్ల ర‌ద్దు విష‌యం చుక్క‌లు చూపిస్తోంది. ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డం, ఉత్ప‌త్తి వ్యాపారాలు పూర్తిగా డౌన్ కావ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే, ఇది నాణేనికి ఒక‌వైపే! మ‌రో వైపు కూడా సీఎం కేసీఆర్ ఈ నోట్ల ర‌ద్దుతో తీవ్రంగా మ‌థ‌న ప‌డుతున్నారు.

వాస్త‌వానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తొలి వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. ఇక‌, ఇప్పుడు అదే ఊపుతో రెండున్న‌రేళ్ల పాల‌న వ‌చ్చేనెల డిసెంబ‌రు 2తో ముగియ‌నున్న నేప‌థ్యంలో మ‌రింత గ్రాండ్‌గా దీనిని సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని గులాబీ ద‌ళం నిర్ణ‌యించింది. గ‌త ఏడాదికి ఇప్ప‌టికి ఎంతో తేడా కూడా ఉంది. బంగారు తెలంగాణ సాధ‌న ల‌క్ష్యంలో భాగంగా.. ఇప్ప‌టికే మిష‌న్ బ‌గీర‌థ‌, మ‌హారాష్ట్ర‌తో నీటి ఒప్పందాలు వంటివి కుదుర్చుకున్నారు. ఇక‌, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జిల్లాల విభ‌జ‌న కూడా కేసీఆర్ ఎన్నో శ్ర‌మ‌ల‌కు ఓర్చుకుని చేసేశారు. దీంతో 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా ఆవిర్భ‌వించింది.

ఈ క్ర‌మంలో ఆయా జిల్లాల‌కే టీఆర్ ఎస్ అధికార ప్ర‌తినిధుల‌ను, ఇంచార్జుల‌ను నియ‌మించుకోవాల‌ని, అదేవిధంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో విప‌క్షాల‌కు గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల‌ని కూడా డిసైడ్ అయ్యారు. కానీ, గ‌డిచిన వారు రోజులు గా రాష్ట్రంలో ప‌రిస్తితులు మారిపోయాయి. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న త‌ర్వాత అన్నికార్య‌క‌లాపాలు దాదాపు స్తంభించాయి. అదేవిధంగా ప్ర‌భుత్వానికి ఆదాయం నిలిచిపోయింది. దీంతో డిసెంబ‌రు 2న భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని భావించిన స‌భ స‌క్సెస్ అయ్యే అవ‌కాశం లేద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు రోజు వారి ఖ‌ర్చుల కోసం బ్యాంకుల వ‌ద్ద పెద్ద ఎత్తున క్యూలైన్ల‌లో నించొని ఇబ్బందులు ప‌డుతూ ఉంటే సంబ‌రాలు చేయ‌డం స‌బ‌బు కాద‌ని, మ‌రింత‌గా విప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అదేవిధంగా స‌భ నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చును కూడా భ‌రించే ప‌రిస్థితిలేక‌పోవ‌డంతో కేసీఆర్ ఏకంగా సంబ‌రాల‌ను వాయిదా వేయ‌డ‌మో ర‌ద్దు చేయ‌డ‌మో చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. మొత్తానికి టీఆర్ ఎస్ సంబురాల‌కు ప్ర‌ధాని మోడీ ప‌రోక్షంగా షాక్ ఇచ్చార‌న్న‌మాట‌!!