చంద్ర‌బాబు – కేసీఆర్‌కు ఒకే టెన్ష‌న్ ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి విప‌క్ష పార్టీల నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. ఈ జంపింగ్‌ల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు క‌నీస సంప్ర‌దాయాలు కూడా పాటించ‌కుండా విప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీలు జంప్ చేసిన ఎమ్మెల్యేల‌తో పాటు వీటిని ప్రోత్స‌హించిన చంద్ర‌బాబు, కేసీఆర్ సైతం ఇర‌కాటంలో ప‌డనున్నార‌ని తాజా సంఘ‌ట‌న‌లు దోహ‌దం చేస్తున్నాయి.

తెలంగాణ‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ముందుగా తెలంగాణలో టీడీపీ ప్లోర్ లీడ‌ర్ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. త‌ర్వాత ఆయ‌న కూడా టీఆర్ఎస్‌లోకి జంప్ అవ్వ‌డంతో త‌న పిటిష‌న్ విర‌మించుకున్నారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌కు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్‌కుమార్ మ‌రో పిటిష‌న్‌ను సుప్రీంకోర్టులో వేశారు. అయితే ఈ అంశంలో స్పీక‌ర్లు నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చెప్ప‌డంతో స్పీక‌ర్లు కాల‌యాప‌న చేస్తూ అధికార పార్టీల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు.

ఇప్పుడు ఈ విష‌యంలో ధ‌ర్మాస‌నం పిరాయింపుల అంశంలో ఎప్ప‌టిలోగా చ‌ర్య‌లు తీసుకోవాలో మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తే స్పీకర్ ఖచ్చితంగా చాలా త‌క్కువ టైంలోనే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే జంపింగ్ ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డ‌డ‌మే లేదా వారు త‌మ శాస‌న‌స‌భ్య‌త్వాల‌కు రాజీనామా చేయాల్సి రావ‌డ‌మో జ‌రుగుతుంది. అదే జ‌రిగితే సీఎంలు చంద్ర‌బాబు, కేసీఆర్ భారీ ఎత్తున ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ్వాల్సి ఉంటుంది.

ఏపీ, తెలంగాణ‌లో సుమారుగా 50 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోయారు. వీరంతా రాజీనామా చేసినా లేదా వీరిపై అన‌ర్హ‌త వేటుప‌డినా వీరిని తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్య‌త సీఎంల‌పై ఉంటుంది. వీటిల్లో కొంద‌రు ఎమ్మెల్యేలు ఓడిపోయినా వీరికి వ‌చ్చే బ్యాడ్ నేమ్ అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహితం పెద్ద‌ సమస్యగా మారనుంది.