ఆ విష‌యంలో కేసీఆర్‌కు చిక్కులు త‌ప్ప‌వా

2019 ఎన్నిక‌ల‌ను దృష్టి లో పెట్టుకుని ఇప్ప‌టి నుంచి పొలిటిక‌ల్‌గా ప్రిపేర్ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కొత్త త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. రాష్ట్ర సాధ‌న అనంత‌రం తెలంగాణ‌లో ఒక్క టీఆర్ ఎస్ త‌ప్ప మ‌రో పార్టీ ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ భావించారు. అదేక్ర‌మంలో ఆయ‌న అధికారం చేప‌ట్టిన కొద్దిరోజుల్లోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి తెర‌దీశారు. దీంతో టీడీపీ స‌హా కాంగ్రెస్‌లోని ఉద్ధండులు క్యూక‌ట్టుకుని మ‌రీ కారెక్కేశారు. అయితే, వీరంతా కేసీఆర్‌పై పెద్ద పెద్ద ఆశ‌లు పెట్టుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా వీరంద‌రినీ ద‌గ్గ‌ర‌కు తెచ్చుకోవ‌డం ద్వారా 2019లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాస్త‌వానికి ఆయ‌న దృష్టిలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా రాష్ట్రంలో అధికారం చేప‌ట్టాల‌ని భావించారు.

 ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక‌, దీంతో ఆయ‌న వ‌చ్చిన వారంద‌రినీ సంతృప్తి ప‌రిచే కార్య‌క్ర‌మానికి తెర‌తీశారు. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను పెంచ‌డంతో పాటు జిల్లాల విభ‌జ‌న ద్వారా ఎక్క‌వ మంది నేత‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ఆయ‌న ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అనుకున్న‌దే త‌డువుగా కేసీఆర్‌.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. జిల్లాల విభ‌జ‌న‌కు మొగ్గుచూపారు. ద‌స‌రానాడు విజ‌య‌వంతంగా జిల్లాల ఏర్పాటు కూడా పూర్తి చేశారు. 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా అవ‌త‌రించింది.

 దీంతో పార్టీలో చాలా మంది ప‌ద‌వులు క‌ల్పించారు. ఇక‌, 2019లో ఎన్నిక‌లే మిగిలాయి. వీటిపై దృష్టి పెట్టిన కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. అయితే, ఇది త‌న చేతిలో ఉన్న విష‌యం కాక‌పోవ‌డంతో ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. దీంతో ఆయ‌న కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని నిర్ణ‌యించారు. నిజానికి విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను తెలంగాణలో 119 సీట్ల‌ను 153కి, అలాగే ఏపీలో 175 సీట్లను 225కు పెంచుకోవ‌చ్చు. అయితే 2026 వరకూ దేశంలో సీట్ల సంఖ్యను పెంచే అవకాశం క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామం కేసీఆర్‌కు ఒక‌ర‌కంగా గుబులు పుట్టిస్తోంది.

2019 నాటికి నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే.. ఇప్ప‌డు కొత్త‌గా ఆయ‌న కారెక్కిన ఇత‌ర పార్టీ సీనియ‌ర్ల‌కు టికెట్‌లు కేటాయించ‌డం క‌త్తిమీద సాముతో ప‌ని అన్న‌ట్టుగా మారుతుంది. అప్ప‌డు ఒక్క‌సారిగా టీఆర్ ఎస్‌లో అసంతృప్త జ్వాల‌లు ఎగిసిప‌డ‌తాయి. దీంతో వీరంతా వేరే పార్టీల్లోకి వెళ్లినా వెళ్లిపోవ‌చ్చు అని కేసీఆర్ యోచిస్తున్నారట‌. టిక్కెట్లు ద‌క్క‌క అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అసంతృప్తి వాదులు ఒకేసారిగా ఇత‌ర పార్టీల్లోకి వెళితే అది కేసీఆర్‌కు పెద్ద మైన‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి దీనిని త‌ట్టుకునేందుకు ఉన్న ఏకైక మార్గం నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవ‌డ‌మేన‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో పార్టీ ఎంపీల‌ను రెడీ చేస్తున్నార‌ని తెలుస్తోంది. వీరు పార్ల‌మెంటు బ‌య‌ట‌, లోప‌ల కూడా సీట్ల పెంపుపైనా ఇక‌పై మాట్లాడ‌నున్నార‌ని టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.