ఆ ఎన్నిక‌ల్లో పెద్ద నోట్ల ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

ఎన్నిక‌ల‌న్నాక నోట్ల‌తోనే ప‌ని!! అంత‌లా మారిపోయాయి దేశంలో ఎన్నిక‌లు. నిజానికి చెప్పాలంటే.. మారిపోలేదు మ‌న నేత‌లే అలా మార్చేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా నోట్లు కొట్టందే ఓట్టు రాల‌ని ప‌రిస్థితి. అవి ఢిల్లీస్థాయి ఎన్నిక‌లైనా, గ‌ల్లీ స్థాయి ఎన్నిక‌లైనా.. పోరులో గెల‌వాలంటే.. నోట్లు కుమ్మ‌రించాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు 11 మునిసిప‌ల్ స్థానాల‌కు, 5 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. ప్ర‌భుత్వం ఓట‌ర్ల జాబితా పంప‌గానే ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు రెడీగా ఉంది.

ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్య‌లో మునిసిపోల్స్ బ‌రిలో భారీ ఎత్తున త‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీల నేత‌లూ ఇప్ప‌టి నుంచి త‌మ త‌మ ఏర్పాట్ల‌తో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. టికెట్ పొంద‌డం ద‌గ్గ‌ర నుంచి ఓట్లు పొందే వ‌ర‌కు, గెలుపు గుర్రం ఎక్కే వ‌ర‌కు అడుగడుగునా.. నోట్ల‌తోనే ప‌ని! అయితే, ఇప్పుడు అనూహ్యంగా ప్ర‌ధాని మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయడంతో ఈ ప్ర‌భావం మునిసిపోల్స్‌పై పెద్ద ఎత్తున ప‌డే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు రూ.500, రూ.1000 నోట్లు మార‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో అంద‌రూ కొత్త నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ క్ర‌మంలో నేత‌లు సైతం త‌మ వ‌ద్ద ఎన్నిక‌ల కోసం కూడ‌బెట్టుకున్న పాత నోట్ల‌ను పంచితే.. తీసుకునే వారు ఒక్క‌రూ ఉండ‌రు. సో.. కొత్త నోట్ల‌నే పంచాల్సిన అవ‌సరం ఉంది. అయితే, ఎన్నిక‌ల్లో ఆన‌వాయితీగా ఉన్న రూ.500 పంచ‌డం ఇక‌పై సాగుతుందా? అనేది ప్ర‌శ్న‌. కేవ‌లం ఇప్పుడు మార్కెట్‌లో రూ.2000 నోట్లు ఒక్క‌టే చెలామ‌ణిలో ఉంది. ఇంకా కొత్త రూ.500 నోట్లు మార్కెట్‌లోకి రాలేదు. అదేస‌మ‌యంలోరూ.1000 కోత్త నోటు త‌యారీనే ప్రారంభం కాలేద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఈ రెండు మార్కెట్‌లోకి ఎప్పుడెప్పుడు వ‌స్తాయా? అని నేత‌లు ఎదురు చూస్తున్నారు. లేక‌పోతే.. ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున రూ.2000 నోట్ల‌ను స‌మ‌ర్పించుకోవాల్సి వ‌స్తుంది.

దీనికితోడు ఇప్పుడున్న ప‌రిస్థితి ఇప్ప‌టికే నేత‌లు రెడీ చేసుకున్న నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో వీటిని మార్చుకోవ‌డం పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారింది. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యానికి వీటిని మార్చుకోవ‌డ‌మా?  లేక పంచే డ‌బ్బుల కోసం.. పెద్ద ఎత్తున ఉన్న ఆస్తుల‌ను విక్ర‌యించ‌డ‌మా? అనేది నేత‌ల ముందున్న నూరు డాల‌ర్ల ప్ర‌శ్న‌! ఇలా మోడీ నిర్ణ‌యం మునిసిపోల్స్‌పై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని నేత‌లు మ‌ధ‌న‌ప‌డుతున్నారు.