2019 ఎన్నిక‌ల్లో గెలుపున‌కు జ‌గ‌న్ వ్యూహం ఇదే

ఏపీలోని ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా.. ఎట్టిప‌రిస్థితిలోనూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. వాస్త‌వానికి 2014లోనే అత్య‌ధిక మెజారిటీతో వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని అంద‌రూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేష‌ణ‌లు, స‌ర్వేలు కూడా వ‌చ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన డ్వాక్రా రుణ‌మాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ స‌వారీ చేయ‌డానికి, టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి. అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం, ఇటు అప్పుడే కొత్త‌పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప్ర‌చారం చేయించుకోవ‌డంతో అధికారంలోకి వ‌చ్చేందుకు తేలికైంది.

కానీ, అప్ప‌టి వాతావ‌ర‌ణం, విశ్లేష‌ణ‌ల‌నేప‌థ్యంలో జ‌గ‌న్ మాత్రం అహం బ్ర‌హ్మ అన్న త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రించి దాదాపు సీఎంసీటు ఎక్కేసిన‌ట్టుగానే ఫీలైపోయారు. కానీ, ప‌రిస్థితి త‌ల్ల‌కిందులైంది. ఇక‌, ఇప్పుడు మాత్రం 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల్సిన అగ‌త్యం ఏర్ప‌డింది. ఒక ప‌క్క ఉక్కిరి బిక్కిరిచేస్తున్న కేసులు, ఆర్థిక స‌మ‌స్య‌లు, జారిపోతున్న కేడ‌ర్ వీట‌న్నింటినీ నిల‌బెట్టుకోవాలంటే.. జ‌గ‌న్‌కు అధికారంలోకి రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈక్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి నుంచే 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌త్యేక వ్యూహ ర‌చ‌న‌లో మునిగిపోయాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌ధానంగా చంద్ర‌బాబుకు వ్య‌తిరేక వ‌ర్గాలుగా ఉన్న‌వారిని ఆయ‌న ఎంత‌గానో ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాపులు చంద్ర‌బాబు కు పూర్తిగా యాంటీగా మారిపోయారు. వారికి ఇస్తాన‌న్న రిజ‌ర్వేష‌న్‌పై చంద్ర‌బాబు మీన‌మేషాలు లెక్కించ‌డం, దాని నుంచి త‌ప్పించుకునేందుకు వివిధ ప‌థ‌కాల‌తో కాపు యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం వంటివి కాపుల‌ను ఒకింత బాధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కాపుల‌ను ద‌గ్గ‌ర చేయ‌డం ద్వారా వారి ఓటు బ్యాంకును త‌న బుట్ట‌లో వేసుకోవాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నారు. ఈ ఫార్ములాను ప్ర‌స్తుతం ఆయ‌న తిరుప‌తి స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌వేశ పెట్టాల‌ని చూస్తున్నారు. అదేవిధంగా.. ఒక‌ప్పుడు బాబుతో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన కామ్రెడ్ల‌ను కూడా జ‌గ‌న్ చేర‌దీయాల‌ని చూస్తున్నారు.

వాస్త‌వానికి జ‌గ‌న్‌పైకేసులు న‌మోదైన సంద‌ర్భంలో స‌హా 2014 ఎన్నిక‌ల్లో నూ కామ్రెడ్లు జ‌గ‌న్ విప‌రీతంగా తిట్టిపోసిన వాళ్లే. అక్ర‌మ సంపాద‌న‌ను జ‌నానికి పంచిపెట్టాల‌ని మైకులు ప‌ట్టుకుని మ‌రీ ఊరూ వాడా ప్ర‌చారం చేసిన‌వారే. కానీ, వారు ఊహించిన విధంగా 2014 ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు రాక‌పోయే స‌రికి ఉనికి కోల్పోయే ప‌రిస్థితి దాపురించింది. దీంతో ఏదో ఒక ఆధారం వారికి త‌ప్ప‌నిస‌రి. పోనీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కి రానిస్తారా? అంటే అది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంది. ఇక‌, కాంగ్రెస్‌, బీజేపీల‌తో జ‌త కట్టే ప‌రిస్థితిలేదు. దీంతో వారికి మిగిలిన ఏకైక ప్ర‌త్యామ్నాయం జ‌గ‌న్‌,

మ‌రోప‌క్క జ‌గ‌న్‌కూడా ఉద్య‌మాలు, త‌దితరాల విష‌యంలో చంద్ర‌బాబుపై పోరుకు కామ్రెడ్ల‌ను వినియోగించుకుంటున్నారు. ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా కోసం చేసిన ఒక‌రోజు బంద్‌లో కామ్రెడ్ల సాయం తీసుకున్నారు.కాబ‌ట్టి 2019 ఎన్నిక‌ల్లో వారితో జ‌త‌క‌ట్టి చంద్ర‌బాబును దెబ్బ‌తీయాల‌ని జ‌గ‌న్ ప్లాన్ వేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్పుడు తాజాగా తిరుప‌తి ఎన్నిక‌ల్లో కామ్రెడ్ల‌తో జ‌త‌క‌ట్ట‌డాన్ని చూస్తే అది క‌నిపిస్తోంది. సో.. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు జ‌గ‌న్ విన్ ఫార్ములా ఇదే న‌నే మాట వినిపిస్తోంది. మ‌రి ఈ ఫార్ములా ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.