స్నేహితుడితో జ‌గ‌న్‌కు షాక్ రెడీ చేస్తోన్న లోకేష్‌

తెలుగుదేశం పార్టీలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కొంత‌కాలంగా క్రియాశీల‌క పాత్రను పోషిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే… లోకేష్‌కు మంత్రి ప‌ద‌వినిచ్చి పాల‌న‌లో మ‌రింత ముఖ్య పాత్ర వ‌హించే అవ‌కాశం ఇవ్వాల‌ని ఇటీవ‌ల‌ పార్టీ నుంచి గ‌ట్టి డిమాండే వ‌చ్చినా… ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌డం ఇష్టం లేని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..  ప్ర‌స్తుతానికి పార్టీ నేత‌ల‌కు సర్ది చెప్పి ఆ అంశాన్ని ప‌క్క‌న పెట్టారు.

ఇదిలా ఉండ‌గా 2019 ఎన్నిక‌ల‌నాటికి అధికారం చేజిక్కించుకునే స్థాయిలో బ‌ల‌పడాల‌ని శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్న విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్… చంద్ర‌బాబుకు త‌న‌కూ ఉన్న వ‌య‌సు అంత‌రం కూడా త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న ఈ అంశాన్ని త‌న ప్ర‌చారంలో వాడుకున్నారు కూడా. చంద్ర‌బాబుకు వ‌య‌సు అయిపోతోంద‌ని, తాను మ‌రో ముప్ప‌య్యేళ్లు రాజ‌కీయాల్లో ఉంటాన‌ని జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో త‌ర‌చూ ప్ర‌చారంలో భాగంగా చెప్పుకోవ‌డం తెలిసిందే. అయితే ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో…లోకేష్ కు పెరుగుతున్న ప్రాధాన్యం జ‌గ‌న్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంద‌నే చెప్పాలి. దీనికి కార‌ణం లేక‌పోలేదు… భవిష్య‌త్తులో రాష్ట్రంలో అధికారం కోసం లోకేష్‌తో జ‌గ‌న్ పోటీ ప‌డాల్సి వ‌స్తే.. త‌న‌ది యువ నాయ‌క‌త్వం అని చెప్పుకునే అవ‌కాశం, అడ్వాంటేజీ జ‌గ‌న్‌కు ఎంత‌మాత్రం ఉండ‌వు.  ఎందుకంటే లోకేష్ జ‌గ‌న్ కంటే వ‌య‌సులో చిన్న‌వాడు.

ఈ నేప‌థ్యంలో లోకేష్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఆదిలోనే గండి కొట్టాల‌ని వైసీపీ అధినేత‌ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే ప్రారంభించారు. అందులో భాగంగానే.. జ‌గ‌న్ సొంత మీడియాలో ఇటీవ‌ల లోకేష్‌పై జ‌రిగిన దుష్ప్ర‌చారం.., అత‌డిపై వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల ర‌గ‌డ‌,  ఆ త‌ర్వాత లోకేష్  త‌న‌పై వైసీపీ చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని గ‌ట్టిగా ఖండిస్తూ జ‌గ‌న్‌కు బ‌హిరంగ‌లేఖ రాయ‌డం, జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌తో టీడీసీ నేత‌లు విరుచుకుప‌డ‌టం వంటి ప‌రిణామాలు చాలా వేగంగా జ‌రిగిపోయాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వ ప‌ద‌వుల‌కు దూరంగా ఉండి.. పార్టీ వ్య‌వ‌హారాల్లో మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న లోకేష్ కూడా…జ‌గ‌న్ పార్టీ త‌న‌ను టార్గెట్ చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ జ‌గ‌న్‌కు త‌న త‌డాఖా ఏంటో చూపించాల‌ని గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్నాడ‌ని టీడీపీ వ‌ర్గాల స‌మాచారం.

జ‌గ‌న్‌కూ లోకేష్ కూ మ‌ధ్య మొద‌లైన ప‌రోక్ష‌ రాజ‌కీయ యుద్ధంలో భాగంగా మొద‌ట‌గా  కృష్ణా జిల్లాలో వైసీపీకి గట్టి ఝలక్ త‌గ‌ల‌బోతోంద‌ని స‌మాచారం.  ఆ పార్టీ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక్క‌డ విశేష‌మేమిటంటే లోకేశ్‌కు, వేదవ్యాస్‌ తనయుడు కిషన్‌తేజ్‌కు మధ్య స్నేహం ఉంది. దీంతో లోకేష్ ఈ వ్య‌వ‌హారాన్ని అటునుంచి న‌రుక్కొచ్చిన‌ట్టు తెలుస్తోంది.  2014 ఎన్నికలకు ముందే వేదవ్యాస్‌ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగినా అది కార్య‌రూపం దాల్చ‌లేదు. వేద‌వ్యాస్  అనూహ్యంగా పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి కాగిత వెంకట్రావు చేతిలో ఓడిపోయారు.

అప్పటి నుంచి నియోజకవర్గంలో అప్పుడప్పుడూ పర్యటించడం తప్పితే వైసీపీలో అంటీముట్టనట్లుగానే  వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌తోను, ఇతర నాయకులతోనూ ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయం బలపడింది. దీనికి తగినట్లుగానే ఆయన గురువారం బందర్‌లోని తన స్వగృహంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వేద‌వ్యాస్ వారితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే… ఈయన రాకను పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ రీతిలో స్వాగతిస్తారో చూడాల్సి ఉంది. ఏమైనా లోకేష్ జ‌గ‌న్ మొద‌లుపెట్టిన దాడికి గట్టికౌంటర్ నే ఇస్తున్నాడని ప్ర‌స్తుతం.. పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు  ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.