ఏపీ రాజ‌ధానిలో టీడీపీతో బీజేపీ క‌టిఫ్‌

2014 నుంచి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మ‌ధ్య రానురాను కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేకత కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల కాలంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం మ‌రింత‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత‌గా పెంచింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక‌, ఇప్పుడు ఇదే నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం విష‌యంలో గుంటూరు బీజేపీ నేత‌లు మ‌రింతగా కారాలు మిరియాలు నూర‌డంతోపాటు అస‌లు టీడీపీతోనే క‌టీఫ్ చెప్పేందుకు సిద్ధ‌మైపోయారు. త్వర‌లోనే అన్నికార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు టీడీపీ త‌న శ్రేణుల‌కు ప‌క్కా వ్యూహం అమ‌లు చేయాల‌ని కూడా నిర్దేశించింది. అయితే, బీజేపీ, టీడీపీలు పొత్తుగా ఉన్నాయి కాబ‌ట్టి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ పొత్తు ధ‌ర్మం పాటిస్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, త‌మ‌కు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో టీడీపీ అన్యాయం చేస్తోంద‌ని, ఎందుకూ కొర‌గాని ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతోంద‌ని అల‌క వ‌హిస్తున్న క‌మ‌లం పార్టీ నేత‌లు సైకిల్‌తో తెగ‌తెంపులు చేసుకుని సొంతంగానే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో గుంటూరు బీజేపీ నేత‌లు మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  వాస్త‌వానికి గతనెలలో రాష్ట్రంలోని  పది  కార్పొరేషన్‌లకు చైర్మన్‌లతో పాటు 100 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ హస్తకళల అభివద్ధి సంస్థ, కనీస వేతనాల సిఫార్సు కమిటీ, దుర్గ‌గుడి, అన్నవరం దేవస్థానాలతోపాటు వివిధ కార్పొరేషన్‌లు ఉన్నాయి.

అయితే, బీజేపీ శ్రేణులకు దేవస్థానాల్లో మినహా మరే నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ప్రాధాన్యం కల్పించలేదు. దేవస్థానంలో కూడా పదిమంది సభ్యుల్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ నేతలు విసిగిపోయారు. గతవారంలో ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు కమిటీ విషయంలోనూ ఇదే పునరావృతమైంది. ఈ ప‌రిణామం గుంటూరు బీజేపీ నేత‌ల‌కు మండేలా చేసింది. దీంతో నువ్వు వద్దు, నువ్వు ఇచ్చే ప‌ద‌వులు వ‌ద్ద‌ని టీడీపీకి రాం రాం చెప్పాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే త్వరలో జరగనున్న గుంటూరు మున్సిపల్‌ ఎన్నికల్లో 52 డివిజన్‌లలోనూ పోటీ చేయాలని తాము నిర్ణ‌యించుకున్న‌ట్టు  గుంటూరు బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు మీడియాతో చెప్పారు. అయితే, టీడీపీతో పొత్తు ఉంటుంద‌ని, అయినా తాము అన్ని డివిజ‌న్ల‌లోనూ డెప్యూటీ మేయర్, మేయర్‌ స్థానాలకు తప్పనిసరిగా పోటీకి దిగుతామ‌ని వివ‌రించారు. సో.. దీనిని బ‌ట్టి. దాదాపు గుంటూరులో టీడీపీతో బీజేపీ క‌టీఫ్ ఖ‌రారైంద‌నే తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టికే విజ‌య‌వాడ ప‌రిణామంతో త‌ల‌బొప్పి క‌ట్టిన బీజేపీ రాష్ట్ర సార‌ధి కంభంపాటి  హ‌రిబాబు గుంటూరు దెబ్బ‌కి ఎలాంటి కాయ‌క‌ల్ప చికిత్స చేస్తారో చూడాలి.