మంత్రుల‌ను ఉతికి ఆరేసిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. ఆగ్ర‌హంతో ఊగిపోయారు. త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై నిప్పులు క‌క్కారు. ప్ర‌తిప‌క్షంపై ఎందుకు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఒక ప‌క్క  విప‌క్షా లు అన్నీ క‌లిసి ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే మీకు క‌నిపించ‌డంలేదా? అంత పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తుంటే మీకు వినిపించ‌డం లేదా? అంటూ ఉతికి ఆరేశారు. కేసీఆర్ ఉగ్రానికి మంత్రులంద‌రూ షాక్ అయిపోయార‌ట‌. శుక్ర‌వారం జ‌రిగిన ఈ ప‌రిణామం తెలంగాణ అధికార పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది.

‘‘రైతు గర్జనలు చేస్తున్రు. చివరికి సీ బ్లాక్‌ ముందు ధర్నాలు చేస్తున్నారు! అయినా మీరు చూస్తూ ఊరుకుంటారా!? ఆర్థిక పరిస్థితి బాగా లేదని బద్‌నాం చేస్తుంటే మీరేం చేస్తున్నట్లు!? ప్రతిపక్షాల విమర్శలపై సమాధానం ఎందుకు చెప్పడం లేదు? వారి వాదనలను ఎందుకు ఖండించరు? ఇంకెంత కాలం ఇట్లుంటరు!?’’ అంటూ మంత్రులపై సీఎం కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌లు, ఆర్థిక ప‌రిస్థితిపై వ‌స్తున్న వార్త‌ల‌పై కేసీఆర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా విప‌క్షాల‌కు త‌గిన విధంగా స‌మాధానం ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారంటూ ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగున్నా ప్రతిపక్షాల విమర్శలను గణాంకాలతో సహా ఖండించకుండా ఉంటే ఎటువంటి సంకేతాలు పోతాయని నిలదీశారు. విపక్షాల విమర్శలను మంత్రులంతా సమర్థంగా తిప్పికొట్టాలని ఆదేశించారు. , రైతు రుణమాఫీ పథకాన్ని సక్రమంగా అమలు చేయటం లేదం టూ విపక్షాలు ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్న అంశం కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. గడిచిన 6నెలల్లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.22,500 కోట్ల ఆదాయం సమకూరిందని, గత ఏడాది కంటే ఇది 21 శాతం ఎక్కువ ప్ర‌భుత్వం లెక్క‌లు చెబుతోంది.

ఈ లెక్క‌న  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటే, బకాయిలు చెల్లించటం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎందుకు గట్టిగా స్పందించటం లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని, సమన్వయ లోపం ఎక్కడ తలెత్తుతోందని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డిని నిల‌దీసిన‌ట్టు తెలిసింది. సో.. ఇలా కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గాన్ని దుమ్ముదులిపి వ‌దిలిపెట్టార‌న్న‌మాట‌. మ‌రి ఇప్ప‌టికైనా మంత్రులు నోరువిప్పి విప‌క్షంపై ఎదురు దాడి చేస్తారో లేదో చూడాలి.