టీడీపీలో మంత్రి వర్సెస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే

గుంటూరులో టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎవ‌రికి వారే త‌మ ఆధిప‌త్యం చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు తామే సొంతంగా వివిధ విభాగాల‌కు సంబంధించిన అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించేస్తున్నారు. స‌మావేశాలు పెట్టేస్తున్నారు. దీంతో అధికారుల్లో తీవ్ర అయోమయం నెల‌కొంటోంది. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌లు ఒక పార్టీ గొడుగు కిందే ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రికీ స‌మ‌న్వ‌య లోపంతో పాటు ఆధిప‌త్యం విష‌యంలోనూ పైచేయి సాధించేందుకు పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నారు. అ నేపథ్యంలో వారం కింద‌ట మోదుగుల త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

అదేస‌మ‌యంలో గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రితో సంబంధం లేకుండానే అధికారుల‌తో భేటీ కావ‌డం, ప‌నుల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఇదిలావుంటే, ఇప్పుడు సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు సైతం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు స‌మీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నా.. ఆయ‌న అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకుని స‌మీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అటు పార్టీ నేత‌లు, మంత్రుల‌కు సూచిస్తున్నారు. ఈ విష‌యంలో అధికారులు, క‌లెక్ట‌ర్లు కూడా స‌హ‌క‌రించాల‌ని ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల భేటీలోనూ చంద్ర‌బాబు స్ప‌ష్టంగా చెప్పారు.

అయితే, ఇప్పుడు అధికారుల‌తో స‌మ‌స్య కాకుండా అస‌లు టీడీపీ నేత‌ల మ‌ధ్యే స‌మ‌న్వ‌యం కొర‌వ‌డ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా మ‌రో రెండు మాసాల్లో ఖ‌చ్చితంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గుంటూరు కార్పొరేష‌న్ అతి పెద్ద‌ది. దీనిలో పాగా వేయాలంటే నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం త‌ప్ప‌నిస‌రి అని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలోనూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయిన‌ప్ప‌టికీ.. గుంటూరులో మంత్రి రావెల వ‌ర్సెస్ ఎంపీ జ‌య‌దేవ్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మోదుగుల అన్న‌ట్టుగా నే ఉంది ప‌రిస్థితి . ఇదే వాతావ‌ర‌ణం ఎన్నిక‌ల‌స మ‌యానికి కూడా కొన‌సాగితే టీడీపీ కి ఇబ్బంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి వీటిపై చంద్ర‌బాబు స్పందిస్తారో లేదో చూడాలి.