రాహుల్ డెసిష‌న్ టీ కాంగ్రెస్‌ను ముంచుతుందా

గ‌త ఎన్నిక‌ల‌ముందు .. తెలంగాణ‌పై గట్టి ఆశ‌లే పెట్టుకున్న‌కాంగ్రెస్ పార్టీని ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏస్థాయిలో ఖంగుతినిపించాయో ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఆ పార్టీ అధిష్ఠానమైతే ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేద‌నే చెప్పాలి.  ప‌దేళ్ల‌పాటు తెలంగాణ అంశాన్ని సాగ‌దీసి, చివ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా  గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఒడిసిప‌డ‌దామ‌ని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఫ‌లితాలు చూశాక గ‌ట్టి గుణ‌పాఠ‌మే నేర్చుకుంద‌ని చెప్పాలి.

ఆ గుణ‌పాట‌మేమంటే.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. ఆ పార్టీ స్థానిక నేత‌ల వాద‌న‌ల‌ను.. ఇక‌పై గుడ్డిగా న‌మ్మ‌కూడ‌ద‌ని కాంగ్రెస్ అధిష్ఠానం కాస్త సీరియ‌స్‌గానే నిర్ణ‌యించుకుంద‌ట‌. ప్ర‌త్యేక రాష్ట్ర‌మిస్తే చాలు.. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల‌ను గెలిపించుకునే పూచీ త‌మ‌ద‌ని ఈ నాయ‌కులు అప్ప‌ట్లో గ‌ట్టిగానే హామీ ఇచ్చార‌ట మ‌రి. తీరా ఫ‌లితం ఉల్టా కావ‌డంతో.., వారి మాట‌లు న‌మ్మి.. ఇటు ఏపీలో పార్టీని స్వ‌యంగా తామే చంపేసుకున్నామ‌ని ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు తెగ ఇదైపోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇంత‌కూ విష‌య‌మేమిటంటే.. విప‌క్షాలు బ‌లంగా ఉన్న ప్రాంతాల‌ను చీల్చి వారిని రాజ‌కీయంగా చెడుగుడు ఆడుకునేందుకు టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ‌లో జిల్లాల సంఖ్య‌ను భారీగా పెంచేసిన సంగ‌తి తెలిసిందే.. ఈ నేప‌థ్యంలో పార్టీ తిరిగి బ‌లం పుంజుకునేలా చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేప‌ట్టిన‌  కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  తెలంగాణలో కొత్త‌గా ఏర్ప‌డిన మొత్తం 31 జిల్లాల‌కు   పార్టీ అధ్యక్షుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్న పార్టీ అధిష్ఠానం.. జిల్లా పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. రానున్న రోజుల్లో సాధారణ ఎన్నికల్లో డీసీసీ అధ్య‌క్షులెవ‌రికీ… పార్టీ టికెట్లు కేటాయించేది లేద‌ని తేల్చేసింది. అంటే  ఈ నిర్ణ‌యం ద్వారా పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించే నేతలంతా పార్టీని బలోపేతం చేయటంపైనే దృష్టి పెట్టాలా చేయాల‌న్నది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనగా తెలుస్తోంది.

పార్టీ తిరిగి కోలుకునేలా చేయ‌డంలో భాగంగానే ఈ కీలక నిర్ణయాన్ని రాహుల్ తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ జిల్లా నేత‌లు ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశిస్తూ.. వారి సొంత‌ నియోజకవర్గం మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారని.. దీంతో పార్టీకి.. క్షేత్ర స్థాయి లో క్యాడ‌ర్‌కు మ‌ధ్య దూరం పెరుగుతోంద‌న్న విష‌యం పార్టీ అధిష్ఠానం గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యే జిల్లా పార్టీ ముఖ్యనేతలకు.. ఎమ్మెల్సీలు.. ఇతర నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని కూడా నిర్ణయించారు. మొత్తంమీద కాంగ్రెస్ యువ నేత తీసుకున్న ఈ నిర్ణ‌యం పార్టీకి ఏమాత్రం బ‌లం చేకూరుస్తుందో తెలియ‌దు కానీ.. చాలామంది ఆశావ‌హుల‌కు మాత్రం షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి.