పేప‌రు వైకాపా నేత‌ది…భ‌జ‌న బాబుది

గ‌తంలో ఓ వెలుగు వెలిగినా ప్ర‌స్తుతం చిన్న‌ప‌త్రిక‌ల స్థాయికి ప‌డిపోయిన ఓ ప‌త్రికా సంస్థ అనుస‌రిస్తున్న రాజ‌కీయ వ్యూహం ఏమిటో ఎవ‌రికీ అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే స‌ద‌రు ప‌త్రికా య‌జ‌మాని  కొంత కాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతంలో ఈయ‌న‌గారికి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. త‌న‌యుడికి రాజ‌కీయంగా భవిష్య‌త్తు ఉంటుందన్నఆశ‌తో ఆపార్టీలో చేరిన స‌ద‌రు నేత‌  ఆ మేర‌కు కొడుక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరి ఆ పార్టీ అధినేత వ‌ద్ద హామీ పొందిన‌ట్టు  ప్రచారమూ ఉంది.

ఈ వ్య‌వ‌హారం ఇలా ఉండ‌గా ఈ కుటుంబం యాజమాన్యంలోని పత్రికలో మాత్రం ఈ మ‌ధ్య కాలంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు భజన ఓ స్థాయిలో జ‌రుగుతుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ప‌త్రిక రాత‌ల ప్ర‌కారం.. ఇంకో రెండు నెల‌ల్లో జ‌రిగే అమెరికా ఎన్నిక‌ల్లో గెలిచే వ్య‌క్తి ఆ దేశ ప్రెసిడెంట్‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేసే కార్య‌క్ర‌మానికి  అప్పుడే బాబుగారికి ఆహ్వానం అందేసింద‌ట‌. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగే ఇంకా జరగలేదు.. హిల్లరీ గెలుస్తుందా, ట్రంప్ గెలుస్తాడా? అనే అంశం గురించి ఇప్ప‌టిదాకా ఖ‌చ్చిత‌మైన అభిప్రాయం ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు.

అమెరిక‌న్ మీడియాతో పాటు, ప్ర‌పంచ మీడియాలో అమెరికా ప్ర‌జ‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ పడుతున్న అభ్య‌ర్థుల ఆద‌ర‌ణ‌పై  ప‌లు ఊహాగానాలు వెలువ‌డుతున్నా ఇంకా ఏ విష‌య‌మూ స్ప‌ష్టంగా తెలియ‌దు. అయితే తెలుగు మీడియాలో ఒక‌వ‌ర్గం  మాత్రం హిల్లరీ గెలిచేసినట్టే.. ఆమెను బాబుగారే గెలిపించేస్తున్నార‌న్నంత క‌ల‌రింగ్ ఇచ్చేస్తున్నాయి. హిల్లరీకి బాబుకు బంధుత్వం కూడా ఉన్నట్టే.. లోకేష్ బాబు, చెల్సియాల మధ్య అనురాగం ఉంది.. అంటూ ఏదేదో తోచినట్టుగా రాసుకుపోతోంది.

ఇక ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు భ‌జ‌న మ‌రింత భారీగా మొద‌లుపెట్టిన పత్రిక  యజమాని మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కావ‌డ‌మే విశేషం..!మరి ఈ విషయాల గురించి వైసీపీ  అధినేత జ‌గ‌న్‌కు తెలిస్తే ఏమ‌వుతుందోన‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. లేక వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి ఒకవేళ వైసీపీ ప‌రిస్థితి అనుకున్నంత పుంజుకోక‌పోతే మ‌రో చేత్తో టీడీపీలోకి వెళ్లే  ఆప్ష‌న్ కూడా ఈ నేత‌ తెరిచే ఉంచుకుంటున్నారేమోన‌న్న గుస‌గుస‌లూ ఇంకోప‌క్క‌ మొద‌లైపోయాయి మరి.