కేసీఆర్ కోరిక బాబు తీరుస్తాడా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాన్య ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల మాట‌ల మ‌రాఠీగానే చాలామందికి తెలుసు. కానీ ఆయ‌నకు మ‌త ప‌ర‌మైన న‌మ్మ‌కాలు, సెంటిమెంట్లు, వాస్తు ప‌ట్టింపులు కూడా బాగా ఎక్కువ‌ని ఆయ‌న స‌న్నిహితులకు మాత్ర‌మే తెలుసు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోస‌మంటూ ఆయ‌న భారీగా నిర్వ‌హించిన‌  చండీయాగం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌డం కోసం ఈ యాగం నిర్వ‌హిస్తారు. ఈ యాగం ఫ‌లితంగానే అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని కేసీఆర్ ప్ర‌గాఢ న‌మ్మ‌క‌మ‌ని ఆయ‌న గురించి బాగా తెలిసిన‌వారు చెపుతారు. ఆ త‌ర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా అధికారం చేప‌ట్టాక ఆయ‌న మ‌రోసారి క‌ళ్లు చెదిరే స్థాయిలో య‌జ్ఞాలు, యాగాలు నిర్వ‌హించ‌డ‌మేకాక‌ దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ‌ ప్ర‌ముఖులంద‌రినీ ఈ కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానించి, భారీ హంగామాతో వారిని కూడా అబ్బుర‌ప‌రిచారు.

ఇక తాజాగా కేసీఆర్ తాను పాల‌న సాగిస్తున్న‌సచివాల‌యం, నివాసం ఉంటున్నఅధికారిక భ‌వ‌నం త‌దిత‌ర వాటిలో ఉన్న వాస్తు లోపాల‌పై గ‌ట్టిగానే దృష్టి పెట్టార‌ట‌. ఈ స‌చివాల‌యం నుంచి ప‌రిపాల‌న చేసిన ఏ ముఖ్య‌మంత్రి త‌న కొడుకును త‌న వార‌సుడిగా నిల‌ప‌లేక‌పోయార‌న్న అభిప్రాయం కేసీఆర్‌లో బ‌లంగా పాతుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. అందుకే సాధ్య‌మైనంత త్వ‌రగా స‌చివాల‌య భ‌వ‌నాన్నికూల‌గొట్టి కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే కేసీఆర్‌ కోట్లాది రూపాయిల ఖర్చుతో భారీ స్థాయిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కట్టిస్తున్న సంగతి ఈ సంద‌ర్భంగా గ‌మ‌నించాలి.

అయితే స‌చివాల‌యం విష‌యంలోనే కేసీఆర్ కు ఓ చిక్కువ‌చ్చి ప‌డింది.  విభజన నేపథ్యంలో సచివాలయాన్ని రెండుగా విభజించి.. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించటం తెలిసిందే.  విభ‌జ‌న నాటి ఒప్పందాల ప్ర‌కారం ఈ భ‌వ‌నాల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి ప‌దేళ్ల‌వ‌ర‌కు హ‌క్కుంటుంది. అందుక‌ని ఏపీ ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా ఈ భ‌వ‌నాల‌ను తొల‌గించ‌డం కేసీఆర్ కు సాధ్యంకాదు.  నిజానికి ఇటీవ‌ల‌ ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయానికి ఏపీ సచివాలయ శాఖల కార్యాలయాలు చాలావ‌ర‌కు త‌ర‌లిపోయాయి.  ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ కార్యాలయాల్లో ఏపీ అధికారులు నామమాత్రపు సిబ్బందితో కొన్ని రికార్డులను నిర్వహిస్తున్నారు. ఈ భవనాల్ని ఖాళీ చేసి తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుతున్నారు. వాస్తవానికి ఇదేమంతా పెద్ద విషయం కాద‌నే చెప్పాలి.

వ‌చ్చిన స‌మ‌స్య‌ల్లా ఉభ‌య రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య ఉప్పు_నిప్పులా ఉన్న‌ప‌రిస్థితే… ఇదే.. ఇప్పుడు కేసీఆర్‌కు ఈ విష‌యంలో అడ్డంకిగా మారింది. ఇద్ద‌రు చంద్రుల‌కూ సంబంధాలు అంతంత‌మాత్రంగానే ఉన్న‌కార‌ణంగా చంద్ర‌బాబును నేరుగా అడ‌గ‌లేని కేసీఆర్ తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న న‌ర‌సింహ‌న్ ద‌గ్గ‌ర ఈ అంశాన్నిక‌దిపార‌ట‌.  తాము కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నామ‌ని.. అందుకు అనుగుణంగా ఏపీ సచివాలయ కార్యాలయాల్ని ఖాళీ చేసి తమకు అప్పగించేలా చూడాల‌ని, ఏపీ ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైతే  ప్రత్యామ్నాయ భవనాల్ని కేటాయిస్తామని కేసీఆర్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి  వెంట‌నే ఈ భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే వీలు ఏపీకి సర్కారుకు ఉన్నా…కేసీఆర్ వ్య‌వ‌హార శైలిపై అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని.. ఇవ్వ‌డం కుద‌రద‌ని చెపితే గ‌వ‌ర్న‌ర్ కూడా చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.