అడ్డంగా బుక్ అయిన టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే

ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌వాళ్లు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాలి. ఒక‌వేళ వీలు కాక‌పోతే వారికి న‌చ్చ‌చెప్పుకోవాలి. లేదా ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి దిగాలి. ఇది ఎక్క‌డైనా ఉన్న ప‌ద్ధ‌తి. కానీ, ఈ ప‌ద్ధ‌తిని ప‌క్క‌న పెట్టిన తెలంగాణ‌లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం కోసం, ప్ర‌జ‌ల ఆగ్ర‌హం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం కోసం భ‌లే గిమ్మిక్కు ప్లే చేశారు. త‌న‌కు టికెట్ ఇచ్చి, విప్ హోదా ఇచ్చి గౌర‌వించిన ప్ర‌భుత్వ అధినేత‌నే బోనులో ఇరికించేశారు. త‌న త‌ప్పు లేద‌ని, అంతా పెద్దాయ‌న వ‌ల్లే ఇది జ‌రిగింద‌ని న‌మ్మించారు. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. కానీ, ఇప్ప‌డు నిజం బ‌య‌ట‌ప‌డింది! వాస్త‌వం తెలిసిపోయింది. ఆ విప్ అడ్డంగా దొరికిపోయింది. మ‌రి అదేంటో మీరూ తెలుసుకోండి!

తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పెద్ద ఎత్తున దుమారం రేపిన విష‌యం తెలిసిందే.  ఈక్ర‌మంలో కొన్ని మండ‌లాల‌ల‌ను విడ‌దీసి కొత్త జిల్లాల్లో క‌లిపారు. అదే లెక్క‌న  తెలంగాణ ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి ప్ర‌తానిధ్యం వ‌హిస్తున్న  ఆలేరు  నియోజకవర్గంలో ఏడు మండ‌లాలు ఉన్నాయి. వీటిలో గుండాల ఒక‌టి. అయితే జిల్లాల ఏర్పాటు లో భాగంగా ఈ గుండాల మండ‌లంలోని కొన్ని గ్ర‌మాలు విడిపోయి వేరే మండ‌లాల్లో చేరిపోయాయి. ఓ గ్రామం మోటకొండూరు మండలంలోకి వెళ్లగా, రెండు ఆత్మకూరు (ఎం) మండలంలోకి వెళ్లాయి. ఈ రెండూ కొత్త‌గా ఏర్ప‌డిన యాదాద్రి జిల్లాలోకి వెళ్లాయి. ఇక‌, మిగిలిన గ్రామాలతో కూడిన గుండాల మండ‌లం అప్ప‌టిక‌ప్పుడు తెర‌మీద‌కి వ‌చ్చిన జ‌న‌గామ జిల్లాలో క‌లిపారు. ఈ ప్ర‌క్రియ అంతా అక్టోబ‌రు 3, 4 తేదీల్లో జ‌రిగింది. ఎందుకంటే.. జ‌న‌గామ జిల్లాను తొలి నుంచి సీఎం కేసీఆర్ వ్య‌తిరేకించారు. అయితే, చివ‌రినిమిషంలో ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే, జ‌న‌గామ జిల్లాలో గుండాల మండ‌ల గ్రామాల‌ను క‌ల‌ప‌డంపై అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారు. దీనిపై వెంట‌నే స్పందించిన స్థానికులు ఈ నెల 6, 7 తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఇదే విష‌యాన్ని త‌మ ఎమ్మెల్యే, విప్ అయిన  గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డికి వెల్ల‌డించారు. ఈ ప‌రిణామంతో ఉలిక్కిప‌డ్డ ఆమె విష‌యాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్టు ఏదీ జ‌ర‌గ‌లేదు. ఇక ఈ విష‌యంలో స‌ర్ది చెప్పాల్సిన విప్‌.. తాజాగా ఓ లేఖ‌ను ప్ర‌జ‌ల ముందు పెట్టారు. ఆ లేఖను సెప్టెంబరు పదో తేదీన తయారు చేసినట్లు తేదీ ఉంటే.. దానిపై గొంగిడి సునీత సెప్టెంబరు 20వ తేదీన సంతకం చేసి, తేదీ కూడా స్వ దస్తూరీతో వేశారు.

ఈ లేఖ‌లో ఏముందంటే..  గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి తొలగించి యాదాద్రిలో కలపాలంటూ తాను ‘ఎప్పుడో’ ప్రభుత్వానికి విన్నవించానని, ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ కూడా రాశానని, కానీ, ప్ర‌భుత్వం త‌న మాట విన‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. వాస్త‌వానికి జ‌న‌గామ జిల్లా ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ ఈ నెల 1 వ‌ర‌కు లేదు. కానీ, విప్ మాత్రం సెప్టెంబ‌రు 20నే ఈ విష‌యంపై తాను లేఖ‌రాశాన‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. కేవ‌లం ప్ర‌జ‌ల ఆగ్ర‌హం నుంచి త‌న‌ను తానుకాపాడుకునే ప్ర‌య‌త్నంలోనే ఆమె పెద్ద పొర‌పాటు చేశార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి త‌న‌ను తాను ర‌క్షించుకునే క్ర‌మంలో అటు కేసీఆర్‌ను బోనులోకి నెట్టిన ఆమె త‌న‌కు తెలియ‌కుండానే తాను ఇప్పుడు ఇరుక్కుపోయారు. దీనిపై గులాబీ ద‌ళాధిప‌తి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!