లోకేష్‌కు గుడ్ న్యూస్‌…ఆమెకు బ్యాడ్ న్యూస్‌

లోకేష్‌కు ప్ర‌భుత్వంలో ప‌దవులిచ్చే అంశాన్నిముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టినా… లోకేష్ రాజ‌కీయ అరంగేట్రం  పేరు చెపితేనే విప‌క్ష వైసీపీ ఉలికిప‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీంతో లోకేష్ పేరు చెపితేనే జ‌గ‌న్ భ‌య‌పడుతున్నార‌ని… జ‌గ‌న్‌కు దీటైన ప్ర‌త్య‌ర్థి లోకేషేన‌ని, విప‌క్ష వైఖ‌రి చూశాక  టీడీపీలో యువ నాయ‌కులు ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అందుకే లోకేష్‌కు ప్ర‌భుత్వంలో స‌ముచిత ప‌ద‌వినివ్వాల‌ని పార్టీ నేత‌లు మ‌రోసారి ముఖ్య‌మంత్రిని క‌లిసి చెప్పిన‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబు పాల‌నా వ్య‌వ‌హారాల్లో తీరిక లేకుండా గ‌డుపుతుండ‌టంతో  ఇప్ప‌టికే పార్టీ వ్య‌వ‌హారాల్లో లోకేష్ క్ర‌మంగా ప‌ట్టు సాధిస్తున్నారు.

నారా లోకేష్ ప్రస్తుతం ప్రజాప్రతినిధి కాకున్నా… మంత్రి వర్గ భేటీల్లో తాను కూడా త‌ర‌చూ పాలుపంచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సీఎం త‌న‌యుడికి ఎంతో కాలంగా ఏపి కేబినెట్ లో కీలక పదవి కట్టబెడతార‌నే వార్త కొంత‌కాలంగా గ‌ట్టిగానే వినిపిస్తున్నా అది ఇప్ప‌టిదాకా ఊహాగానం గానే మిగిలిపోయింది.  అయితే నారా లోకేష్ ను రాజ్యాంగేత‌ర శ‌క్తిగా చూపించేందుకు విప‌క్షం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో లోకేష్‌ను క్యాబినెట్ లోకి తీసుకోవ‌డం ద్వారా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దింపి విప‌క్షం నోటికి తాళం వేయాల‌ని  పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబును కోరిన‌ట్టు స‌మాచారం.

దీపావళి నాడు వెలుగులు నింపడంలో భాగంగా నారా లోకేష్, ఆయన అనుయాయులకు ఆనందం పంచేలా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పండగ ఆఫర్ ప్రకటించ‌డం ఖాయ‌మ‌ని తెలుగు తమ్ముళ్ల మధ్య ప్ర‌స్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. న‌వ్యాంధ్ర‌కు కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను తెచ్చేందుకు ఒక ప‌క్క సీఎం చంద్ర‌బాబు అలుపెరుగ‌కుండా శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉండేలా లోకేష్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుని, ఆయ‌న‌కు  ఐటీ, పరిశ్రమల శాఖను  కట్టబెట్టనున్నట్లు తెలుగు తమ్ముళ్లు  గుసగుసలాడుతున్నారు.

ఈ మేరకు చంద్రబాబు కేబినెట్ లో మార్పులు చేర్పుల కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.దీపావళి ముందుకాని తరువాత కానీ ఏపీ కేబినెట్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి. పలువురు కొత్త వారిని కేబినెట్ లో చేర్చుకోవడంతోపాటు  ప్ర‌స్తుత క్యాబినెట్లో ప‌నితీరులో ఏమంత మంచి మార్కులు  లేని  కొంతమందికి ఉద్వాసన పలికే ఆలోచనలో చంద్ర‌బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ప‌నిలో ప‌నిగా మరికొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు జ‌రిగే  అవకాశం కూడా ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచాం.

నవంబర్ 12 తేదీ నుంచి చంద్రబాబు అమెరికా పర్యటన ఉందని వార్తలు వస్తున్న నేపథ్యం లో ఈ లోపే మంత్రివర్గ విస్తరణను చేసే అవకాశం ఉంద‌ని వార్త‌లందుతున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహిస్తున్న మృణాళిని ని మంత్రి వర్గం నుంచి తప్పించి ఆస్థానం లో ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ను తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.మొత్తంమీద ఈ దీపావ‌ళి కొంద‌రు పార్టీ నేత‌ల‌కు మోదం.., మ‌రికొంద‌రికి ఖేదం మిగ‌ల్చ‌నుంద‌న్న‌మాట‌.