ఏపీ స‌చివాల‌యం మూతేనా?

దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు సేవలందించిన హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌య భ‌వ‌నం ఇప్పుడు శ్మ‌శాన నిశ్శ‌బ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో గుంటూరులో అమ‌రావాతి రాజ‌ధానితోపాటు వెల‌గపూడిలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం ఏర్పాటు చేశారు. మ‌న ప్రాంతం మ‌న పాల‌న పేరును ప‌దే ప‌దే జ‌పిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ లోని స‌చివాలయాన్ని వెల‌గ‌పూడిలో నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌య భ‌వ‌నంలోకి మార్చారు. వాస్త‌వానికి విభ‌జన ఒప్పందం ప్ర‌కారం 10 ఏళ్ల‌పాటు హైద‌రాబాద్‌ను ఉమ్మ‌డిరాజ‌ధానిగా నిర్వ‌హించ‌డం పాటు, ప్ర‌స్తుత స‌చివాల‌యాన్ని హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకునేందుకు ఎలాంటి అభ్యంత‌ర‌మూ ఉండ‌దు.

అయితే, మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే ఏపీ కేంద్రంగా పాల‌న సాగాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. అదీకాక‌, పాల‌న ఏపీలో ఉండేది తెలంగాణ‌లో అంటే ప్ర‌జ‌ల్లో యాంటీ మెసేజ్ వెళ్తుంద‌ని, అంతేకాకుండా ర‌వాణా, వ‌స‌తి త‌దిత‌ర భ‌త్యాలు కూడా భారీ ఎత్తున పెరుగుతాయ‌ని లెక్క‌లేసిన సీఎం పాల‌న‌ను విజ‌య‌వాడ కేంద్రంగా అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న దాదాపు  ఏడాదిన్న‌ర కింద‌టే విజ‌య‌వాడ‌లో మ‌కాం వేశారు. అదేవిధంగా ప‌లువురు మంత్రులు సైతం అక్క‌డి నుంచే పాల‌న , స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌, మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో పూర్తిస్థాయిలో పాల‌న‌ను ఏపీ నుంచి నిర్వ‌హిస్తేనే.. పాల‌న గాడిలో పడుతుంద‌ని, ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెరుగుతుంద‌ని అంచ‌నా వేసిన చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ పాల‌న‌లో కీల‌క‌మైన స‌చివాలయాన్ని వెల‌గ‌పూడికి త‌ర‌లించారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధుల‌ను ధార‌పోసి అక్క‌డ తత్కాలిక స‌చివాల‌య భ‌వ‌నాన్ని నిర్మించారు. దీనిపై విప‌క్షాలు సామాజిక సంస్థ‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఊందుకున్నా లెక్క‌చేయ‌కుండా ముందుకు వెళ్లారు.

ఈ క్ర‌మంలో సోమ‌వారం(నేటి నుంచి) నుంచి పాల‌న‌ను పూర్తిగా వెల‌గ‌పూడి నుంచే అందించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ స‌చివాల‌యం రెండు రోజుల కింద‌టే పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్ర‌స్తుతం అత్యంత కీల‌క శాఖ‌ల‌కు సంబంధించి ఒక‌రిద్ద‌రు సిబ్బంది మాత్ర‌మే హైద‌రాబాద్‌లో ఉంటారు. ఇక‌, తెలంగాణ‌లో ఏపీకి చెందిన స‌చివాల‌యాన్ని కేసీఆర్ స‌ర్కారుకి అప్ప‌గిస్తారా?  దానిబ‌దులుగా ఏమైనా తీసుకుంటారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా హైద‌రాబాద్‌లో ఏపీ స‌చివాల‌యం మాత్రం మూత‌బ‌డిన‌ట్టే!!