2019లో వైకాపా పొత్తుల లెక్క‌లివే

కొంత‌కాలం కింద‌టిదాకా  దేశ‌వ్యాప్తంగా వామ‌ప‌క్షాలు అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో త‌మ ప్ర‌భావం చూపుతూ వ‌చ్చాయ‌న్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేని వాస్త‌వం. ఇప్పుడంటే త‌మ ప్ర‌భ‌ను కోల్పోయాయి కాని అధికారంలో ఉన్న‌పార్టీల‌పై క‌మ్యూనిస్టులు చేసే పోరాటాల‌ ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై తీవ్రంగా ఉండేది. చాలా స‌మ‌యాల్లో అధికార ప‌క్షాల‌పై ప్ర‌జావ్య‌తిరేక‌త పెంచి… ఆ త‌రువాత ఎన్నిక‌ల్లో వారిని అధికార  పీఠానికి దూరం చేయ‌డంలోనూ వామ‌ప‌క్షాలు ప్ర‌ధాన పాత్ర‌నే పోషించాయి. అయితే ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ వంటి ఒక‌టి రెండు రాష్ట్రాల్లో మిన‌హా ఈ పార్టీల‌కు స్వ‌యం ప్ర‌కాశ శ‌క్తిలేదు.  మిగిలిన రాష్ట్రాల్లో వీరి పోరాటాల ఫ‌లితాలను ఆయాచితంగా ద‌క్కించుకుంటూ వ‌చ్చింది… ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలేన‌ని చెప్పాలి.

కాగా 2019 సార్వ‌త్రిక  ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఏపీలో అధికార పీఠం  చేజిక్కించుకోవాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ వామ ప‌క్షాలతో పొత్తు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌ సాధించ‌లేక‌పోతే రాజ‌కీయంగా త‌న ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌న్న నిర్ణ‌యానికొచ్చిన జ‌గ‌న్.. వామ‌ప‌క్షాల పోరాట ప‌టిమ త‌న‌కూ క‌లిసి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నారు. సార్వ‌ త్రిక ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం మాత్ర‌మే ఉండటంతో రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తానే స్వ‌యంగా చొర‌వ‌ చూపుతోంది.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమవరం స‌మీపంలో నిర్మించ‌బోతున్న‌ మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ సందర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్టక్రార్యదర్శి పి.మధును అడ్డుకొని పోలీసులు  శ‌నివారం అరెస్టు చేసిన నేపథ్యంలో.. జ‌గ‌న్ స్వ‌యంగా సీపీఎం నేత‌కు ఫోన్‌చేసి వారి పోరాటానికి త‌మ‌మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం. జ‌గ‌న్ స్వ‌యంగా ఫోన్ చేసి మ‌రీ మాట్లాడటం వెనుక  ఉన్న ప్రధాన కారణం ఆ పార్టీలతో  దోస్తీకి వైసీపీ చూపుతున్న‌ ముందస్తు చొరవేనా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మొద‌లైంది.

ఇదే ఆక్వా ఫుడ్ పార్క్ అంశంపై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అక్క‌డి రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు అండ‌గా పోరాడ‌తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు కొద్దిరోజుల‌క్రిత‌మే వార్త‌లు వ‌చ్చిన విష‌యం గ‌మ‌నార్హం.  ప‌వ‌న్ ఇంత‌కు ముందే.. వామ‌ప‌క్షాల‌పై సానుకూల వైఖ‌రిని ప్ర‌క‌టించ‌డంతో భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ పార్టీ క‌మ్యూనిస్టుల‌తో జ‌త క‌ట్టే అవ‌కాశ‌ముంద‌న్న ఆలోచ‌న జ‌గ‌న్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంద‌నే చెప్పాలి. ఎందుకంటే జ‌గ‌న్ అనుమానమే నిజ‌మైతే ఈ ప‌రిణామ‌ అధికార ప‌క్షం వ్య‌తిరేక ఓటు భారీగా చీల్చి వైసీపీకి భారీ నష్టం క‌లిగించ‌డం ఖాయం. బీజేపీతో వైసీపీ పొత్తుకు అవ‌కాశాలు లేక‌పోవ‌డం, కాంగ్ర‌స్ పార్టీ పుంజుకునే అవ‌కాశాలు స‌మీప భ‌విష్య‌త్తులో క‌నిపించ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్.. కాస్తో.. కూస్తో ప్ర‌జ‌ల్లో బ‌ల‌మున్న వామ‌ప‌క్షాల‌తో స్నేహం హ‌స్తం కోసం ప్ర‌స్తుతం త్వ‌రప‌డుతున్నారు.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ఎలా ఉంటుందో చూశాక మాత్ర‌మే వామ‌ప‌క్షాలు పొత్తుల విష‌య‌మై త‌మ నిర్ణ‌యాన్ని వెలువ‌రించే అవ‌కాశ‌ముంది.  సో..జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయో.. లేదో నిర్ణ‌యించ‌డం అపుడే సాధ్యం కాద‌న్న‌మాట‌.. రాష్ట్రంలో సంభ‌వించే రాజ‌కీయ ప‌రిణామాల‌ను నిర్ణ‌యించేది కాల‌మేన‌ని చెప్పాలి.