తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి

వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద స‌వాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేల‌నో? ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌నో ఉద్దేశించి కాదు! త‌న‌కు తానుగానే రువ్వుకున్న స‌వాల్‌! విష‌యంలోకి వెళ్లిపోతే.. వైకాపా త‌ర‌ఫున 2014లో ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేస‌మ‌యంలో ఆయ‌న కుమార్తె అఖిల ప్రియ త‌న త‌ల్లి  శోభ‌ప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది సీనియ‌ర్ల‌ను కూడా కాద‌ని విప‌క్షానికి ల‌భించే పీఏసీ(ప్ర‌జా ప‌ద్దుల సంఘం) చైర్మ‌న్ ప‌ద‌విని జ‌గ‌న్‌.. భూమా నాగిరెడ్డికి అప్ప‌గించారు. అయితే, త‌ర్వాత ఏపీలో మారిన పొలిటిక‌ల్ ప‌రిస్థితులు, టీడీపీ అధినేత విసిరిన ఆక‌ర్ష్ వ‌ల‌కి భూమా ఆయ‌న కుమార్తె చిక్కుకున్నారు.

దీంతో వ‌న్ ఫైన్ డే వాళ్లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో సైకిల్ ఎక్కేశారు. దీంతో అవాక్క‌యిన జ‌గ‌న్ అండ్‌కో.. అప్ప‌ట్లో భారీ మొత్తానికి భూమా అమ్ముడు పోయాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. చానాళ్లు సైలెంట్‌గా ఉన్న భూమా ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లో నోరు విప్పి.. తాను అమ్ముడు పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అదేస‌మ‌యంలో త‌న‌ను జ‌గ‌న్ ఎంత పెట్టి గ‌తంలో కొన్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక అప్ప‌టితో పొలిటిక‌ల్ విమ‌ర్శ‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డింది. ఇక‌, అప్ప‌టి నుంచి పొలిటిక‌ల్‌గా భూమా ఎలాంటి కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌డంలేదు. రేపోమాపో ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే, దానిలో ఆయ‌న‌కు సీటు ఖాయ‌మ‌నే ప్ర‌చారం సాగింది. ఇదంతా ప‌క్క‌న పెడితే… తాజాగా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల‌ను వెడ‌ల్పు చేయించే కార్య‌క్ర‌మం చేపట్టారు.

దీనికి గాను ఆయ‌న విస్త‌ర‌ణ‌కు అడ్డువ‌చ్చిన కొన్ని గృహ స‌ముదాయాలు, వాణిజ్య ప్రాంతాల వారితో చ‌ర్చించి స్థ‌లాలు ఇప్పించేలా, రోడ్ల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించేలా చేస్తున్నారు. అయితే, వైకాపా నేతలు మాత్రం ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన భూమా.. . నంద్యాల అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని  స్పష్టం చేశారు. ఎవరు అడ్డొచ్చినా, ఎన్ని రాజకీయాలు చేసినా నంద్యాలలో రోడ్ల విస్తరణ చేసి తీరుతామని, ఒకవేళ అలా చెయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని త‌న‌కు తానే సవాలు విధించుకున్నారు.  నంద్యాల ప్రజల తాగు నీటి కష్టాలు తీర్చడానికి, వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి నంద్యాల వరకు పైపులైన్‌ నిర్మాణానికి రూ.117 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని భూమా చెప్పారు.  టీడీపీ ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి అవుతుంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్టు మ‌రోసారి చెప్పారు. ఏదేమైనా.. భూమా చేసిన తాజా స‌వాల్ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.