ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేష‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ రానున్న రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వాస్త‌వానికి న‌వంబ‌రు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని త‌మ‌కు చెప్పాల‌ని హైకోర్టు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు కావ‌డం, రెండున్న‌రేళ్ల టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న కు సంబంధించి ప్ర‌జ‌లు వెల్ల‌డించే అభిప్రాయం కావ‌డంతో ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి.

చంద్ర‌బాబుపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, ప్ర‌త్యేక హోదా సాధించ‌లేక‌పోయార‌ని, కేసులు ఉన్నాయ‌ని, అందుకే ఆయ‌న కేంద్రానికి సాగిల‌ప‌డ్డార‌ని వైకాపా అధినేత జ‌గ‌న్ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. మ‌రోప‌క్క ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నా.. వాటికి మైలేజీ పెంచుకోవ‌డంతో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఇదిలావుంటే, కాపు రిజ‌ర్వేష‌న్ పేరుతో ఉద్య‌మం తారా స్థాయికి చేరింది. ప‌శ్చిమ గోదావ‌రి ఆక్వాపార్క్ కూడా టీడీపీ అధినేత ఏక‌ప‌క్ష నిర్ణ‌యంగా ప్ర‌చారంలో ఉంది.

ఈక్ర‌మంలో ఆయా వ్య‌తిరేక ప‌వ‌నాలు ఎన్నిక‌ల‌పై ప‌డే ప్ర‌భావం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మునిపిస‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌త్య‌క్ష లేదా ప‌రోక్ష ప‌ద్ధ‌తుల్లో దేని ద్వారా నిర్వ‌హించాల‌నే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో ఈ రెండు విధానాల‌లో దేనిని ఆశ్ర‌యిస్తే.. త‌న‌కు మైలేజీ పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో రాజ‌ధాని జిల్లా గుంటూరు, పెట్టుబ‌డుల జిల్లాగా పేరొందిన విశాఖ ఉండ‌డంతో బాబు ఈ ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఉన్నా.. ప్ర‌జ‌ల్లో మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేత‌ల‌ను రంగంలోకి దింప‌డం ద్వారా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు నిర్వ‌హించి గెలుపు సాధించ‌వ‌చ్చ‌ని టీడీపీలో ఓ వ‌ర్గం చెబుతుండ‌గా, దీనిని మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు.  అలా అయితే ఛైర్మన్‌ గెలుపుకు వార్డు మెంబర్లుగా పోటీ చేసే వ్యక్తులు సహకరించరని అంటున్నారు. పరోక్షంగానే ఎన్నికలు నిర్వహిస్తే అందరూ కలసి పార్టీ విజయం కోసం కృషి చేస్తారని మరికొంత మంది త‌మ్ముళ్లు స‌ల‌హా ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌లు ప్ర‌త్య‌క్షమా? ప‌రోక్ష‌మా? అనే విష‌యంపై ఇప్పుడు అంద‌రూ దృష్టిసారించారు.