ఇంటిలిజెన్స్ స‌ర్వేతో హ‌డ‌లెత్తుతున్న టీడీపీ!

ఏ విష‌యంపైనైనా వ్య‌క్త‌ల‌పైనైనా స‌ర్వే చేయించే సీఎం చంద్ర‌బాబు ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా కార్య‌చ‌ర‌ణ రూపొందించుకుంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు స‌హా సీఎంగా ఆయ‌న ప‌నితీరుపైనా స‌ర్వే చేయించుకున్నారు. ఆయా రిజ‌ల్ట్స్‌ని బ‌ట్టి ప‌నితీరును మెరుగు ప‌రుచుకుని ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించాల‌ని బాబు ప్లాన్‌. అదే విధంగా త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది?  విజ‌యం సాధిస్తామా లేదా? అనే కోణంలో ఇంటిలిజెన్స్‌తో ఆయన స‌ర్వే చేయించుకున్నారు. తాజాగా ఈ స‌ర్వే నివేదిక చంద్ర‌బాబు చేతికి అందింద‌ని స‌మాచారం.

ఇక‌, ఈ నివేదిక‌లోని విష‌యాలు చూశాక బాబు ఒక్క‌సారిగా ఖంగుతిన్నార‌ని తెలిసింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. కాపుల ఉద్య‌మం  రోడ్డుమీద‌కి వ‌చ్చాక ఆయ‌న కాపుల‌కు కూడా అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. కాపు విద్యార్థ‌లుకు స్కాల‌ర్ షిప్పులు, విదేశీ రుణాలు, విద్యా రుణాలు, ఉపాధి రుణాల పేరుతో కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రిస్తున్నారు. సామాజిక పింఛ‌న్ల‌ను ఠంచ‌నుగా అందిస్తున్నారు. రైతుల‌కు నీటిని, కరెంటును స‌కాలంలో అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ..  తాజాగా అందిన ఇంటిలిజెన్స్ స‌ర్వే మాత్రం టీడీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని తేల్చి చెప్పింది. దీంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ఖంగుతిన్నారు. ముఖ్యంగా గుంటూరు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లలో పరిస్థితి టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగాలేదని రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ట‌!

ఈ కార్పొరేషన్లు అధికార పార్టీకి దక్కటం కష్టమే అని నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి ఫిఫ్టీ..ఫిఫ్టీగా ఉందని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయ‌ట‌. మిగిలిన చోట్ల కూడా పరిస్థితి అంత తేలిగ్గా లేదని ..కాస్త కష్టపడితే మాత్రం ఫలితాలు  సానుకూలంగా వచ్చే అవకాశం ఉందని నివేదిక‌లో స్ప‌ష్టం చేశార‌ట‌.

ఈ ప‌రిణామం నిజంగానే చంద్ర‌బాబుకు పెద్ద హెడేక్‌గా ప‌రిణ‌మించింది. ప్ర‌జ‌ల‌కు ఇన్ని చేస్తున్నా.. ఒక ప‌క్క రాష్ట్ర విభ‌జ‌న‌తో ఖ‌జానాపై భారం పెరిగినా.. అన్ని సంక్షేమ ప‌థ‌కాలూ అమ‌లు చేస్తున్నా ప్ర‌జ‌ల్లో ఎందుకు వ్య‌తిరేక‌త వ‌స్తోందో అర్ధంకాక త‌ల‌ప‌ట్టుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో  ఆయ‌న ఎన్నిక‌ల‌పై మ‌రింత క‌స‌ర‌త్తు చేసే ఛాన్స్ ఉంది. కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను ఎన్నిక‌ల‌కు సిద్ధం చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.