పవన్‌కి వెన్నుదన్నుగా నాగబాబు.

జనసేన పార్టీకి ప్రధాన బలం అభిమానులే. పవన్‌కళ్యాణ్‌కి మొదట్లో మెగా అభిమానుల మద్దతు మెండుగా ఉండేది. అందులోంచి కొత్తగా ‘పవనిజం’ పుట్టింది. తద్వారా పవన్‌కళ్యాణ్‌కి మెగా అభిమానులతోపాటు ప్రత్యేకంగా ఇంకో అభిమానగణం తయారైందని చెప్పడం నిస్సందేహం. అయితే మెగా అభిమానుల్నీ, పవన్‌ అభిమానుల్నీ ఒక్కచోట చేర్చే బాధ్యతను ఇటీవల మెగాబ్రదర్‌ నాగబాబు తీసుకున్నారని సమాచారమ్‌. మెగా, పవన్‌ అభిమానుల మధ్య విభేదాలున్నాయని కాదుగానీ, కొన్ని అంశాల్లో ఈ పవన్‌ అభిమానులు, మెగా అభిమానులతో విభేదిస్తుంటారు. అవి కూడా రాజకీయ విభేదాలే. ఈ నేపథ్యంలో నాగబాబు రంగంలోకి దిగి, అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారట.

మొదటినుంచీ చిరంజీవికీ పవన్‌కళ్యాణ్‌కీ నాగబాబు వారధిలా వ్యవహరిస్తున్నారు. ఇది అన్నదమ్ముల అనుబంధం మాత్రమే. చిరంజీవి పార్టీ స్థాపించినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా అభిమూనుల్ని సన్నద్ధుల్ని చేయడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీ నిర్మాణ పనుల్ని పవన్‌కళ్యాణ్‌ చూసుకున్నారు. ఇప్పుడు జనసేన విషయంలో కూడా అన్నయ్య నాగబాబు పాత్రని పవన్‌కళ్యాణ్‌ కోరుకుంటున్నారట. ఎలాగూ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో యాక్టివ్‌గా లేరు గనుక, తమ్ముడికి అభిమానుల పరంగా సాయం చేయడంలో నాగబాబుకీ ఇబ్బంది ఏమీ లేదు. నాగబాబుకి కూడా అన్నయ్య చిరంజీవి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లుగా సమాచారమ్‌.