టీడీపీ, టీఆర్ఎస్‌ను మోడీ కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా

కేంద్ర ప్ర‌భుత్వాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేయ‌డం కొత్త‌కాదు! త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వాల‌ను, త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ‌డం కేంద్రంలోని పాల‌కుల‌కు తేలికైన విద్య‌.! ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి న‌చ్చ‌ని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌పై పెత్త‌నం చేయ‌డం, ఇబ్బందులు పెట్ట‌డం కాంగ్రెస్ పాల‌కుల నైజం. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్ర‌యోగించేద‌ని ప్ర‌చారంల ఉందేది. ఇక‌, ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్ర‌భుత్వం కూడా ఇలాంటి వేధింపుల‌కే తెర‌దీసిందా అన్న ధోర‌ణి క‌నిపిస్తోంది. ముఖ్యంగా మోడీ క‌న్ను ప‌డిన రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలే కూలిపోయాయ‌ని అంటారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు.

దీనికి ఉదాహ‌ర‌ణే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అని చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వ‌చ్చింది. అయితే, ఈశాన్య రాష్ట్ర‌మైన అరుణాచ‌ల్‌లో పాగావేయాల‌ని త‌ద్వారా పార్టీకి ప‌ట్టు బిగించాల‌ని క‌మ‌ల సార‌ధి అమిత్‌షా స‌హా ప్ర‌ధాని మోడీ ప్లాన్ వేశారు. దీంతో అక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారి ఇప్పుడు అస్స‌లు కాంగ్రెస్ లేనేలేకుండా పోయింది. ఇక‌, ఇప్పుడు ఇలాంటి ప్లాన్ కాక‌పోయినా.. రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా ప‌ట్టు సాధించాల‌ని మోడీ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏపీ, తెలంగాణ‌ల్లోని అధికార పార్టీల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి అవినీతి మ‌ర‌క అంటేలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే గ‌డిచిన నాలుగు రోజులుగా అటు ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్య‌ల ఆస్తుల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల‌రెడ్డికి చెందిన వ్యాపారాల‌పై బెంగ‌ళూరులో ఐటీ దాడులు జ‌రిగాయి. పెత్త ఎత్తున ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇది జ‌రిగి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే.. చిత్తూరు ఎమ్మెల్యే డీకే స‌త్య‌ప్ర‌భ కుమార్తెకు చెందిన వైద్య క‌ళాశాల‌ల‌పైనా ఐటీ అధికారులు దాడులు చేసి.. 43 కోట్ల రూపాయ‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దు స్వాధీనం చేసుకోవ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇది రెండో సార‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఇక‌, ఈ రెండు ఘ‌ట‌న‌లు ఏపీలో పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. ఇదిలావుంటే, ఐటీ అధికారులు గురువారం తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై పెద్ద ఎత్తున దాడులు నిర్వ‌హించారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు గూడెం మహీపాల్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయ‌నే స‌మాచారం నేప‌థ్యంలో నే ఈ దాడులు జ‌రిగాయ‌ని అధికారులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే భూమి కొనుగోలుకు సంబంధించి వివరాలను అధికారులు సేకరించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. గురువారం మధ్నాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో సుమారు 20 మంది అధికారులు పాల్గొన్న‌ట్టు తెలిసింది. ఏదేమైనా ఈ దాడుల‌తో మోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల‌ను టార్గెట్ చేశారా? అనే సందేహం క‌లుగుతోంది. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో  చూడాలి.