చంద్ర‌బాబు రూమ్‌లో ప్ర‌త్య‌క్షం అయిన జ‌గ‌న్

ఎంత‌టి రాజ‌కీయ వైర‌మున్నా ఎన్నిక‌ల స‌మ‌యంలో మిన‌హాయిస్తే మిగిలిన సంద‌ర్భాల్లో.. అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌రోక్షంగానైనా కాస్తో కూస్తో మ‌ర్యాదపూర్వ‌క‌మైన సంబంధాల‌ను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. స‌మీప భ‌విష్య‌త్తులోనూ సాధ్య‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌క‌మూ క‌ల‌గ‌డం లేదు. టీడీపీ ప్ర‌భుత్వం పై అంశాల‌తో సంబంధం లేకుండా విభేదిస్తున్న‌ జ‌గ‌న్…చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌భుత్వ పాల‌న‌లోని ఏ చిన్న లోపాన్ని వ‌ద‌ల‌కుండా విరుచుకుప‌డుతున్నారు.

విప‌క్ష నేత‌ జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార సాద‌నే ల‌క్ష్యంగా త‌న‌పైనా, ప్ర‌భుత్వం పైనా బుర‌ద చ‌ల్ల‌డ‌మే పనిగా పెట్టుకున్నార‌ని భావిస్తున్న‌ సీఎం చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రికి స‌డెన్‌గా జ‌గ‌న్ త‌న‌ను విమ‌ర్శిస్తూ క‌నిపిస్తే ఏమ‌వుతుంది.. స‌రిగా గురువారం ఇదే జ‌రిగింది. అయితే సీఎం చంద్ర‌బాబుకు విప‌క్ష నేత జ‌గ‌న్ క‌నిపించింది టీవీలోనే లెండి..!

అది విజయవాడ. కమాండ్ కంట్రోల్ రూమ్. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు.. సీఎం చంద్రబాబునాయుడు. కొంత మంది మంత్రులు కూడా అక్క‌డ స‌మావేశంలో ఉన్నారు. గుంటూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేస్తున్నారు. ఇంత‌లో ఆ రూమ్‌ లో ఉన్న టీవీలో ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో జగన్ ప్రత్యక్షం అయ్యారు. అంతే ముఖ్యమంత్రి చంద్రబాబు మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన ముఖ కవళికల్లో మార్పును చూసి అక్క‌డున్న అధికారులు కంగారుప‌డ్డారు. పరిస్థితి గమనించిన కొంద‌రు అధికారులు వెంటనే ఛానల్ మార్చేసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిసేపటికి ఆ ఛానెల్‌లో కూడా జగన్ ప్రత్యక్షం అయ్యారు. అంతే సేమ్ సీన్‌..! మ‌ళ్లీ అధికారులు రిమోట్ కోసం ఉరుకులు.

ఇంత‌కీ విష‌య‌మేమిటంటే ఆరోజ‌ జగన్ ఏలూరులో యువ భేరి స‌భ‌ను నిర్వ‌హించి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పైన‌, సీఎం చంద్రబాబునాయుడు పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ అంశంపై విజువల్స్ వేసి మరీ ప్రజంటేషన్ ఇస్తుంటే టీవీ ఛానెల్స్ ఆ స‌భ‌ను క‌వ‌ర్ చేశాయి. జ‌గ‌న్ స‌భ ప్ర‌సారాల‌ను చూసి చూపుల‌తోనే సీఎం అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో… దెబ్బకు టీవీలు ఆఫ్ అయిపోయాయి. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.