ఆర‌డుగుల బుల్లెట్ అంటున్న కవిత

క‌విత.. ఈ పేరు వింటే కాస్తో కూస్తో క‌న్‌ఫ్యూజ‌న్ ఉండొచ్చేమో కాని తెలంగాణ‌ జాగృతి క‌విత అంటే మాత్రం తెలియ‌నివారు దాదాపు ఉండ‌ర‌నే చెప్పాలి. జాగృతి సంస్థ ద్వారా…తెలంగాణ సంస్కృతికి దాదాపు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయిందీ తెలంగాణ సీఎం గారాల‌ప‌ట్టి. తెలంగాణ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్‌ను ర‌గిలిస్తూ.. రాజ‌కీయాల‌ను పండించ‌డంలో తండ్రికంటే రెండాకులు ఎక్కువే చదివిందీమె.

మాట‌ల మ‌రాఠీగా పేరుప‌డ్డ తండ్రితో స‌మానంగా మాట‌ల తూటాల‌ను విస‌ర‌గ‌ల‌న‌ని ఇప్ప‌టికే నిరూపించుకుంది కూడా… తెలంగాణ సీఎం కేసీఆర్ కు త‌న సోద‌రుడు కేటీఆర్ తో క‌లిసి కుడి ఎడ‌మ‌లుగా నిలుస్తూ పాల‌న‌లో స‌హ‌క‌రిస్తున్న క‌విత ఏం చేసినా, ఏం మాట్లాడినా ఏదో వ్యూహం దాగి ఉంటుంద‌ని ఆమె స‌న్నిహితులు చెపుతారు. తాజాగా ఆమె తెలంగాణ మంత్రివ‌ర్గంలోని ఓ స‌భ్యుడిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఇంత‌కీ ఆమె పొడిగింది ఎవ‌రినో కాదు.. బావ హ‌రీష్‌రావునే… దీనికి కార‌ణ‌మేమిటా… అని ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది.

తెలంగాణ ఉద్యమం మొద‌లైన తొలి ద‌శ‌నుంచీ కేసీఆర్ కు అన్నీ తానై అండ‌గా ఉంటూ వ‌చ్చింది ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీష్‌రావు.. ఉద్య‌మంతో పాటు పార్టీ ఎదుగుద‌ల‌కు కేసీఆర్ త‌రువాత అంత‌గా శ్ర‌మించింది హ‌రీష్‌రావేన‌నడంలో బ‌హుశా ఎవ‌రికీ భిన్నాభిప్రాయం ఉండ‌క‌పోవ‌చ్చు. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌టంలో హ‌రీష్‌రావు వ్య‌వ‌హార‌శైలి ముందు మ‌రెవ‌రూ నిల‌బ‌డ‌లేరు కూడా..! మొద‌ట్లో తెలంగాణ ఉద్య‌మాన్నే వ్య‌తిరేకించాడ‌ని చెప్పుకునే కేటీఆర్ ఫారిన్లో ఉద్యోగం వ‌దులుకుని మ‌రీ తండ్రి బాట‌లో టీఆర్ ఎస్ బాధ్య‌త‌లు పంచుకోవ‌డం మొద‌లుపెట్టాక పార్టీలో హ‌రీష్‌రావు హ‌వా త‌గ్గింద‌నే చెప్పాలి. ఇంకో ర‌కంగా చెప్పాలంటే .. కావాల‌నే కేసీఆర్ అత‌డి పాత్ర‌ను త‌గ్గించార‌నే వ్యాఖ్య‌లూ వినిపించాయి.

అన‌ర్గ‌ళంగా మాట్లాడినా ఆచితూచి మాట్లాడే క‌విత.. మంత్రి హ‌రీష్‌రావును ఆర‌డుగుల బుల్లెట్ అంటూ తాజాగా పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు.. క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌గిత్యాలలో జ‌రిగిన మార్కెట్ క‌మిటీ స‌మావేశంలో మాట్లాడుతూ మార్కెట్ శాఖ‌లో వినూత్న ప‌థ‌కాలు పెడుతూ రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నందుకుగాను హ‌రీష్‌ను క‌విత ప్ర‌శంసించారు.. మార్కెట్ శాఖ‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపిస్తున్నారంటూ కొనియాడారు.. స‌డెన్‌గా క‌విత హ‌రీష్‌రావును పొగ‌డ‌టం వెన‌క కార‌ణాలేంటో అర్థంకాక‌ టీఆర్ఎస్ శ్రేణులు బుర్ర గోక్కుంటున్నారు.

అయితే ఇటీవ‌ల కొన్ని అంశాల్లో క‌విత అభిప్రాయాల‌కు సోద‌రుడు కేటీఆర్ అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని, దాంతో అత‌డిపై అలిగిన క‌విత బావ హ‌రీష్‌ను పొగిడి సోద‌రుడికి ఝ‌ల‌క్ ఇచ్చింద‌ని టీఆర్ ఎస్ లోని కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి.. ఏది వాస్త‌వ‌మో తెలియాలంటే వేచి చూడాల్సిందే మ‌రి..!