కాపు కార్డుతో మంత్రి ప‌ద‌వికి గాలం

ఏపీలో కాపు ఉద్య‌మం సీఎం చంద్ర‌బాబుతో పాటు అధికార టీడీపీని చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఎప్పుడైతే కాపు ఉద్య‌మం స్టార్ట్ చేశాడో అధికార టీడీపీలో ఉన్న కాపుల ప‌రిస్థితి ముందు నుయ్యి ..వెన‌క గొయ్యిలా మారింది. పార్టీ గీసిన గీత దాటి ముందుకు వెళ్ల‌నూ లేరు..అలాగ‌ని కాపుల కోసం ఏం మాట్లాడ‌కుండా ఉండ‌నూ లేరు అన్న చందంగా వీరి ప‌రిస్థితి మారింది. ఈ టైంలో దాదాపు అంద‌రూ టీడీపీ కాపు ప్ర‌జాప్ర‌తినిధులు గోడమీద పిల్లుల్లా వ్యవహరించారు. ఆ తరువాత చంద్రబాబు క్లాసులు పీకడంతో వారంతా ముద్రగడపై విరుచుకుపడడం ప్రారంభించారు.

ఇంత వ‌ర‌కూ ఓకే ఏపీలో త్వ‌ర‌లోనే కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ప్ర‌స్తుతం ఉన్న కాపు మంత్రుల‌కు అద‌నంగా మ‌రో కాపు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయం. ఈ జాబితాలో నిన్న‌టి వ‌ర‌కు తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన జంపింగ్ నేత జ్యోతుల నెహ్రూ పేరు ప్ర‌ముఖంగా తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో టీడీపీలో పాత కాపు కావ‌డంతో పాటు కాపు ఉద్య‌మం ప్ర‌బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ వ్య‌క్తి కావ‌డంతో నెహ్రూకు కాపు కోటాలో బెర్త్ ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కాపులు బ‌లంగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన మ‌రో కాపు ఎమ్మెల్యే ఇప్పుడు కాపు కోటాలో మంత్రి ప‌ద‌వికి ట్రై చేస్తోన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా లాజిక్ లేకుండా విప‌క్ష నేత జ‌గ‌న్‌తో పాటు ముద్ర‌గ‌డ‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్టు నోరేసుకుని ప‌డిపోతార‌న్న టాక్ ఆయ‌న‌పై ఉంది.

ఇక మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పోస్టుపై క‌న్నేసిన ఉమా చాలా తెలివిగా మంత్రి ప‌ద‌వి కోసం తెర వెన‌క మంత్రాంగం న‌డిపిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు నాయకత్వంలో పలువురు కాపు నాయ‌కులు సీఎం చంద్ర‌బాబును క‌లిసి ఉమాకు కాపు కోటాలో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో కూడా టీడీపీ పాల‌న‌లో కోస్తాకు కీల‌క‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి శనక్కాయల అరుణ – సింహాద్రి సత్యనారాయణ – వడ్డే రంగారావు మంత్రులుగా పనిచేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఈ విన‌తి వెన‌క ఉమా స్కెచ్ ఉంద‌న్న టాక్ కృష్ణా జిల్లా టీడీపీలో వినిపిస్తోంది. ఏదేమైనా ఉమా కాపు సెంటిమెంట్‌తో మంత్రి ప‌ద‌వికి గాలం వేయ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా ఈ ప్లాన్ వ‌ర్క్ అవ్వ‌డం క‌ష్ట‌మే. కాపుల్లో ముందు జ్యోతుల నెహ్రూ రేసులో ఉంటే..ఆ త‌ర్వాత తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. వీరంద‌రిని దాటుకుని ఉమాకు మంత్రి ప‌ద‌వి రావ‌డం క‌ష్ట‌మే.