హెరిటేజ్ కి ఆ దూకుడు ఎందుకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌. పాలు పాల ఉత్ప‌త్తులు స‌హా రిటైల్ బిజినెస్ చేసే హెరిటేజ్ ఇప్పుడు మంచి ఊపుమీద ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. హెరిటేజ్ షేర్లు ఈ నెల సెకండ్ వీక్‌లో అమాంతం ఆకాశానికి దూసుకుపోయింది. హెరిటేజ్ షేర్ బుధవారం రూ.888 వద్ద క్లోజ్ అయింది. ఈ మ‌ధ్య కాలంలో ఇంత మొత్తంలో కోట్ కావ‌డం ఇదే తొలిసార‌ని మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. అయితే, గ‌తంలో హెరిటేజ్ షేర్‌కు ఇంత డిమాండ్ ఉందా? ఇంత రేంజ్ ఉందా? అంటే మార్కెట్ వ‌ర్గాలు మౌనం వ‌హిస్తున్నాయి.

వాస్త‌వానికి రెండున్న‌రేళ్ల కింద‌ట ఇదే హెరిటేజ్ షేర్ ఒక్కొక్క‌టీ రూ.275 నుంచి రూ.300 మ‌ధ్య ఉంది. కానీ, ఈ మ‌ధ్య కాలంలోనే అమాంతం షేర్ వాల్యూ పెరిగిపోయింది. అంటే ఈ రెండేళ్ల కాలంలో షేర్ వాల్యూ దాదాపు రూ.600 దాకా పెరిగింద‌నేది మార్కెట్ వ‌ర్గాల క‌థ‌నం. అయితే, అస‌లు హెరిటేజ్ షేర్లు ఇంత‌లా పెరిగిపోవ‌డానికి కార‌ణం ఏంటి? అంత‌లా దాని బిజినెస్ ఏమ‌న్నా ఊపందుకుందా? అంటే అది కూడా లేద‌ని అంటున్నారు షేర్ మార్కెట్ నిపుణులు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం మిల్క్‌ మార్కెట్ బాగోలేద‌ని, రిటైల్ రంగం కూడా ఏమంత ఊపుమీద‌లేద‌ని చెబుతున్నారు. హెరిటేజ్ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగాలేద‌ని అంటున్నారు.

హెరిటేజ్ ప్రధాన మార్కెట్లలో ఒకటైన హైదరాబాద్ మార్కెట్లోకి అమూల్ రాకతో కంపెనీ తన పాల ధరను కొంత కాలం క్రితం ఏకంగా లీటర్ కు 4 రూపాయలు తగ్గించింది. కొద్ది కాలం క్రితమే హెరిటేజ్ రిటైల్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ (లాభనష్టాలు లేని స్థితి)కి వచ్చింది. మ‌రి ఇలాంటి టైంలోనూ హెరిటేజ్ షేర్ పెర‌గ‌డం ఏంటి? అంటే.. దీనికి ఒక్క‌టే రీజ‌న్ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం హెరిటేజ్ ఫ్రెష్ చైర్మ‌న్ నారా భువ‌నేశ్వ‌రి.. ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి కావ‌డ‌మేన‌నే టాక్ విన‌బ‌డుతోంది. హెరిటేజ్‌ షేర్ మార్కెట్‌ని ఏపీ ప‌వ‌ర్ మార్కెట్ ప్ర‌భావితం చేస్తోంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. సో.. ఇదేన‌న్న‌మాట‌.. హెరిటేజ్ షేర్ దూకుడు వెన‌క మ‌త‌ల‌బు.