మోడీ తెలంగాణ టూర్‌ – టిటిడిపి దిగులు 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న ప్రాంతాలపై అవగాహన కోసం తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయి, ప్రధాని టూర్‌పై చర్చించాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేస్తారు. మిషన్‌ భగీరధ ఇందులో ముఖ్యమైనది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను మొదటి నుంచీ సమర్ధిస్తోంది నరేంద్రమోడీ ప్రభుత్వం. దాంతో తెలంగాణలో నరేంద్రమోడీ టూర్‌ గురించి తెలంగాణ టీడీపీ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కీ బీజేపీకీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం పరంగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌ చేసే కార్యక్రమాల్ని నరేంద్రమోడీ అభినందించక తప్పదు.

ఇదివరకు పలువురు కేంద్రమంత్రులు తెలంగాణకి వచ్చినప్పుడు టిఆర్‌ఎస్‌ పాలనను అభినందించారు. తద్వారా తెలంగాణ బిజెపి నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. టిడిపిది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కేంద్రంతో సఖ్యంగా ఉండి, కేంద్రంలో చేరాలనే ఆలోచనతో టిఆర్‌ఎస్‌ ఉంది. తెలంగాణలో టిడిపి ఖాళీ అయిపోవడంతో, బిజెపి కూడా టీఆర్‌ఎస్‌తో స్నేహాన్నే కోరుకుంటోంది. ఏదేమైనా నరేంద్రమోడీ తెలంగాణ టూర్‌తో రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పులను చూడాల్సి రావొచ్చు.