మోడీ టూర్‌పై కేసీఆర్‌ వ్యూహాలేంటో!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు నరేంద్రమోడీ హాజరుకానున్నారు. తొలిసారి ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది.

అయితే, పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్రమోడీ టూర్‌ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, మంత్రులందర్నీ మోహరిస్తున్నారు. నరేంద్రమోడీ హాజరయ్యే కార్యక్రమాలకు భారీగా జన సమీకరణ కూడా చేపడుతున్నారు. ఇది ఎవరూ ఊహించని అంశం. 50 కోట్ల పైన ఖర్చు చేస్తున్నారనే ప్రచారం కూడా వినవస్తోంది. ఈ ఖర్చు మాటెలాగున్నా జనాన్ని సమీకరించడం గురించి రాజకీయ వర్గాలలో పలువురూ వింతగా చర్చించుకుంటున్నారు.

ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎక్కడా జరగలేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అమరావతి శంకుస్థాపనకు నరేంద్రమోడీ వెళ్ళిన తరుణంలో అక్కడ చంద్రబాబు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే టిడిపి, బిజెపి మిత్రపక్షాలు అక్కడ. టిఆర్‌ఎస్‌, బిజెపి రాజకీయంగా వైరి పక్షాలు. అయినప్పటికీ చంద్రబాబు చేసిన ఏర్పాట్లతో పోల్చుకుని కెసియార్‌ ఏర్పాట్లు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఏదో బలంగా ఉండే ఉంటుంది.