సునీల్‌ డబుల్‌ ధమాకా

కామెడీ హీరో సునీల్‌ ‘ఈడు గోల్డ్‌ ఎహె’ సినిమాతో డబుల్‌ ధమాకా ఇవ్వబోతున్నాడట. తెరపై ఇద్దరు సునీల్‌లు ఒకేసారి కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? అవునండీ ఇది నిజమట. ‘ఈడు గోల్డ్‌ ఎహె’ సినిమాలో సునీల్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారమ్‌. అయితే సినిమా విడుదలకు దగ్గరయ్యేదాకా ఈ విషయాన్ని చాలా గోప్యంగా దాచిపెట్టారు.

ఇప్పటికి కూడా దీనిపై అధికారిక సమాచారం లేకపోవడం గమనించదగ్గది. వీరు పొట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈడు గోల్డ్‌ ఎహె’ ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. దీంట్లో మాస్‌ మసాలా అంశాలు కూడా ఉన్నాయట. సునీల్‌ సిక్స్‌ ప్యాక్‌ని కూడా అభిమానులకు చూపించబోతున్నాడట దర్శకుడు వీరు పొట్ల. ఓ పాత్ర సైలెంట్‌గా ఉంటే, ఇంకోపాత్ర వైలెంట్‌గా మాస్‌గా ఉంటుందని సమాచారమ్‌.

ఈ తరహా డ్యూయల్‌ రోల్స్‌ చాలామంది పెద్ద హీరోలు చాలా చాలా సినిమాల్లో చేసేశారు. ‘హలోబ్రదర్‌’ సినిమా అలాంటిదే. చిరంజీవి కూడా ‘ముగ్గురు మొనగాళ్ళు’ లాంటి సినిమాలు చేశారు. ఇటీవల వచ్చిన ‘జక్కన్న’తో తన మార్కెట్‌ని పదిలంగా పెంచుకున్న సునీల్‌, ‘ఈడు గోల్డ్‌ ఎహె’తో మరింత పెంచుకుంటాడని అంచనా వేస్తున్నారు టాలీవుడ్‌లో. సునీల్‌ ఇచ్చే డబుల్‌ ధమాకా ‘ఈడు గోల్డ్‌ ఎహె’ సినిమా నిర్మాతకి కనక వర్షం కురిపిస్తుందేమో చూడాలిక.