నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దినేష్‌రెడ్డి

నయీం ఎన్‌కౌంటర్‌, నయీం గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్‌రెడ్డి. ఇలాంటి ఎన్‌కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు.

తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని ఆపరేషన్లలో ఇటువంటి నేరచరిత్ర ఉన్నవారిని వాడుకోవడం మామూలే అయినా, వాడుకునే క్రమంలో కింది స్థాయి అధికారులే తప్ప పైస్థాయి అధికారుల ప్రమేయం ఎక్కడా ఉండదని డిజిపిగా పనిచేసిన తన అనుభవాల్ని వివరించారాయన. ఐపిఎస్‌ వ్యాస్‌ హత్యపైనా తనదైన రీతిలో దినేష్‌రెడ్డి స్పందించారు. ఆ హత్య సమయంలో తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని, అందుకుగాను తనపై ఆరోపణలు చేసిన ఓ ఛానల్‌ క్షమాపణ కూడా చెప్పిందన్నారాయన.

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఘటన ఓ వైపు కుదిపేస్తోంటే ఇంకో వైపు హైదరాబాద్‌లో కాల్పుల ఘటన భయకంపితుల్ని చేసింది అందర్నీ. బాలానగర్‌లో కాంగ్రెసు నాయకుడు యాదగిరిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యాదగిరి తీవ్రగాయాల పాలయ్యాడు. ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స అందుతోంది. ఈ ఘటనకి కూడా సెటిల్‌మెంట్లే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.