ఎన్టీయార్‌ మనసున్నోడు

ఎన్టీయార్‌ మనసున్నోడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం అనే గుణాన్ని వంటబట్టించుకున్నోడు. అందుకే, పెద్ద మనసుతో తన సినిమా రిలీజ్‌ రోజున తన కటౌట్లకు క్షీరాభిషేకం చేయవద్దని పిలుపునిచ్చాడు. క్షీరాభిషేకం కోసం వినియోగించే పాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, పేదలకు పంచాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు ఎన్టీయార్‌.

తన కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్‌’ ఆడియో విడుదల వేడుకలో ఎన్టీయార్‌ హుందాతనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో, దర్శకుడి నుంచి మైక్‌ తీసుకుని, అభిమానుల్ని వారించాడు. సినిమా కోసం దర్శకుడు ఎంతో కష్టపడ్డాడనీ, సినిమా పూర్తయిన తర్వాత ఆ కష్టం గురించి చెప్పుకునే అవకాశాన్ని దర్శకుడికి ఇవ్వడం మనమిచ్చే గౌరవం అని ఎన్టీయార్‌ పేర్కొన్నాడు. అలాగే తాను మాట్లాడుతున్న సమయంలో సినిమా కోసం పనిచేసిన అందర్నీ గుర్తుచేసుకున్నాడు ఎన్టీయార్‌.

సాధారణంగా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లు చేసే ఎన్టీయార్‌, ఈ సినిమాతో సొసైటీకి ప్రకృతిని ప్రేమించాలనే మంచి మెసేజ్‌ ఇవ్వబోతున్నాడు. ట్రైలర్‌ కూడా ఆడియో విడుదల వేడుకలో రిలీజ్‌ చేశారు. సినిమా అద్భుతంగా రూపొందిందని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్‌ టచ్‌తో, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు రూపొందించడంలో దిట్ట అయిన కొరటాల శివ, ఎన్టీయార్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చేలా ఉన్నాడు.