కెసియార్‌ ‘మహా’యజ్ఞం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ మహా యజ్ఞమే చేస్తున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారాయన. ప్రధానంగా గోదావరిపై నీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి సమైక్య తెలుగు రాష్ట్రంతో మహారాష్ట్రకి నీటి వివాదాలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్యా జరిగిన నీటి వివాదాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతమే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది. దాంతో మహారాష్ట్ర నుంచి సన్నిహిత సంబంధాలు తెలంగాణ రాష్ట్రానికి తప్పవు. విధ్వేషాలు పెంచుకోవడం కన్నా పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉండటం మేలని భావించిన కెసియార్‌ విపక్షాలు వద్దంటున్నా మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ ఒప్పందాలు చారిత్రకమని ఒప్పందాల సందర్భంగా కెసియార్‌ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాల కారణంగా దాదాపు ఐదు ప్రాజెక్టులు నిర్మితమయ్యే అవకాశం ఉంది. ఇందులో రెండు మహారాష్ట్ర, మూడు తెలంగాణ నిర్మిస్తాయి. అయితే ఒప్పందాలు వేరు, ఆ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడం వేరు. తెలుగు రాష్ట్రాలకి నీరు రాకుండా చేయడంలో ఇప్పటిదాకా కుట్రలు పన్నిన మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ చొరవతో మనసు మార్చుకోవడం ఒకింత అనుమానమే. బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఎడారిగా మారినప్పటికీ, ఆ ప్రాజెక్టుపై ఇంతవరకు కెసియార్‌ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏదేమైనా కెసియార్‌ మహాయజ్ఞం పబ్లిసిటీకి పరిమితం కాకుండా సత్ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం.