పవన్‌ కళ్యాణ్‌ తనయుడెక్కడ?

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు నటించిన సినిమా ‘ఇష్క్‌వాలా లవ్‌’. పవన్‌ సతీమణి, హీరోయిన్‌ రేణూదేశాయ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్‌ తనయుడు అకీరానందన్‌ ఒక చిన్న పాత్రలో నటించాడు. మరాఠీ భాషలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని తెలుగులో రిలీజ్‌ చేసింది రేణూదేశాయ్‌. ఆ ట్రైలర్‌లో అకీరా ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తోంది. నిజానికి ఆ సినిమాలో అకీరా చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తాడు. తల్లి రేణూదేశాయ్‌ ఈ సినిమాలో తన పుత్రుడు అకీరా నటన గురించి తన పుత్రోత్సాహాన్ని కనబరుస్తోంది. కానీ ట్రైలర్‌లో ఎక్కడా అకీరా కనిపించడం లేదు.

తెలుగు ట్రైలర్‌ కోసం అకీరా ఉన్న సీన్స్‌ని కొన్ని యాడ్‌ చేసి రిలీజ్‌ చేసి ఉంటే బాగుండేదని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. 2014లో విడుదల అయిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో విడుదల చేయాలనుకోవడం వెనుక తల్లిగా రేణూదేశాయ్‌ ఇంట్రెస్ట్‌ తెలుస్తోంది. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ ఫాలోయింగ్‌ సంగతి ఆమెకు తెలుసు. అందుకే తెలుగు ప్రేక్షకులకీ, మెగా అభిమానులకీ తన నుంచి ఒక చిన్న గిఫ్ట్‌ రూపంలో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది రేణూ దేశాయ్‌. అయితే ఈ సినిమా ట్రైలర్‌ని తెలుగులో విడుదల చేయడం వెనుక ఏదైనా మెగా ప్లాన్‌ ఉందా? లేక ఇదంతా పవన్‌ సతీమణి రేణూదేశాయ్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ అంతేనా? అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కానీ అకీరా కూడా ఈ ట్రైలర్‌లో కనిపిస్తే ఇంకా బాగుండేది.