కనకపు సింధూరం

బంగారం గెలవలేదు కానీ బంగారం కంటే గొప్ప ఆటే ఆడింది.అందుకే ఇంటా బయటా ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి.యావత్ భారతావనిని మంత్రముగ్దుల్ని చేసింది సింధు పోరాటం.ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరో వైపు కనక వర్షం మొదలయింది.

ఇప్పటికే పలు రాష్ట్రాలు..అనేక సమాఖ్యలు ప్రభుత్వ, ప్రభుత్వేతరులు సింధుకి నజరానాలు ప్రకటిస్తున్నారు.ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించింది.ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మూడు కోట్ల రూపాయిలు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వడానికి కేబినెట్ సూత్ర ప్రాయంగా అంగీకరించింది.

ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట కూడా సింధుకి కాసుల వర్షం కురుస్తోంది.ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆమెకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్లో రజతం సాధించినందుకు గాను రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.దాంతోపాటు మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్కు కోటి రూపాయిలను ఇవ్వనున్నట్లు తెలిపింది.మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటించింది.