కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన చిరంజీవి

ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ని మెగాస్టార్‌ చిరంజీవి తిరస్కరించారని సమాచారమ్‌. కాంగ్రెసు పార్టీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాను సినిమాలపై దృష్టిపెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చిరంజీవి, ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు వివరించారట.

2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ దాన్ని నడపలేక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. అది చరిత్ర. 2019 నాటికి జనసేన పార్టీకి నాయకత్వం వహించడమా? లేదంటే భారతీయ జనతా పార్టీతో నడిచి వెళ్ళడమా? అన్న విషయాలపై ఖచ్చితమైన అవగాహన లేకపోవడంతో చిరంజీవి రాజకీయంగా మౌనం దాల్చారు.

అయితే కీలకమైన సమయంలో పార్లమెంటుకి వెళ్ళకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి నిన్నటి రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. కానీ రాజ్యసభకు ఆయన వెళ్ళిన ఉద్దేశ్యం నెరవేరలేదు, ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్‌ జరగలేదు. అయితే చిరంజీవిని ప్రత్యేకంగా పిలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని పటిష్టం చేయడానికి తగు చర్యలు వివరించాల్సిందిగా ఆయన్ని కాంగ్రెసు పార్టీ కోరింది. చిరంజీవి మాత్రం పార్టీ కోసం సమయం కేటాయించలేనని చెప్పడంతో ఆశ్చర్యపోయారట కాంగ్రెసు పెద్దలు.