తెలంగాణా రాజకీయం c/o ప్రాజెక్టులు

తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్‌ టాపిక్…. రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను దాదాపు అన్నింటికీ రీడిజైన్ చేస్తూ కొత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు కొత్త డిజైన్లను ఖరారు చేస్తూ పనులను చేపడుతోంది. ఇందుకు సంబంధించి డీపీఆర్ విడుదల చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా….అధికార పక్షం నుంచి మౌనమే సమాధానం అవుతోంది.

ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్న హామీని నెరవేర్చే దిశగానే అడుగులు వేస్తున్న ప్రభుత్వం పాలమూరు జిల్లాపై దృష్టిపెట్టింది.ఈ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భీమా, నెట్టేంపాడు, కల్వకుర్తి తదిర ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత తమకే దక్కుతుందని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని చెబుతున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని అంటున్నారు.ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా… విపక్ష పార్టీలు ,ప్రజా సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి.

పాలమూరు జిల్లా వాసులు ప్రాజెక్టు డిజైన్లను మార్చాలని కోరుతున్నట్లు టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. జిల్లాలో కొత్తగా చేపట్టాల్సిన పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు పాలమూరు జిల్లాలో టీజేఏసీ కమిటీ పర్యటించి, ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని చెబుతున్నారు.