చంద్రబాబు ఈసారి రిస్క్‌ చేయదలచుకోలేదు

పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసినవారు రాజకీయాల్లోకి రావడం వింతేమీ కాదు. సమైక్య తెలుగు రాష్ట్రానికి డిజిపిలుగా పనిచేసిన పేర్వారం రాములు, దినేష్‌ రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పేర్వారం రాములు టిడిపిలో పనిచేసి, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. దినేష్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు.

అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్న సత్సంబంధాల కారణంగా రాజకీయాల్లోకి వచ్చే పోలీస్‌ ఉన్నతాధికారులు ఆ తరువాత స్థిరత్వం ప్రదర్శించలేకపోతున్నారనే భావన రాజకీయాల్లో ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆంధ్రప్రదేశ్‌ డిజిపిగా పదవీ విరమణ చేసిన జెవి రాముడు చెప్పారనుకోవచ్చు. చంద్రబాబు ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినా ఆయన ఆ ఆఫర్‌ని తిరస్కరించారట.

అలాగే పేర్వారం రాములు కారణంగా రాజకీయ అనుభవం సంపాదించుకున్న చంద్రబాబు, జెవి రాముడు విషయంలో తొందరపడలేదని కూడా ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో అందరూ ఒకేలా ఉండరు. రాజకీయాలపై ఆసక్తి, ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఉద్యోగులైనా ఇంకెవరైనా రాణించగలుగుతారు.