ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ రాష్ట్రం మద్దతివ్వనుందట. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌, రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు (కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు)పై ఓటింగ్‌ జరిగితే, అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారమ్‌.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తితో టిఆర్‌ఎస్‌ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కేకే సానుకూలంగా స్పందించారట. ఆంద్రప్రదేశ్‌కి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారట. ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీ దేశంలోని వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ బిల్లుపై ఓటింగ్‌ విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత అసహనంతో ఉంది. మిత్రపక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందేమోనని టిడిపి భయం.

అయితే రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ బిల్లుకి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించడంతో, ఓటింగ్‌పై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే కేంద్రం నుంచి ‘డబుల్‌’ మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సోదర భావం పెంపొందడానికి ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. బిల్లుకి అనుకూలంగా ఓటేస్తే, ఆ బిల్లు పాసైతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌ రునపడి ఉంటుందనడం నిస్సందేహం.