రాజకోట(అమరావతి) రహస్యం తెలుసా?

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన వివరాలు లేకపోవడంతో దానిని ఛాలెంజ్‌ చేయాలని భావిస్తున్న ఇతర నిర్మాణ సంస్థలు ఆయోమయంలో పడుతున్నాయి. కీలక వివరాలు ఉండాల్సిన చోట చుక్కలు (డాట్స్‌) మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆర్థిక అంశాలకు సంబందించిన ముఖ్యమైన వివరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సింగపూర్‌ సంస్థలకే నిర్మాణ పనులను అప్పగించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వ కంగానే చేసిందనే విమర్శలు వినవస్తున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు సిరంగపూర్‌ ప్రభుత్వం, అక్కడి రెండు సంస్థలతో కూడిన కన్సార్టియం ప్రతిపాదనలు సమర్పించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో వాటిని బహిరంగంగా ప్రకటించింది. దీనిపై సెప్టెంబర్‌ ఒకటిలోగా కౌంటర్‌ ఛాలెంజ్‌ చేసుకోవచ్చునని ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కీలక అంశాలను వెల్లడించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఆదాయ పంపిణీకి సంబంధించి అమరావతి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ముందుగా పెట్టాల్సిన పెట్టుబడిని ప్రధాన ప్రైవేటు రంగ భాగస్వామి 99 శాతం పెట్టాలని, నామిని ఒక్క శాతం పెట్టాలని ప్రతిపాదనల్లో చూపించారు. అయితే, ఆ మొత్తం నగదు రూపంలో ఎంత అన్నది స్పష్టం చేయకపోగా సింగపూర్‌ సంస్థలు ఎంత ప్రతిపాదించాయన్నది బహిర్గతం చేయలేదు. అలాగే ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత తొలి 30 రోజుల్లో అందుబాటులో ఉంచాల్సిన నిధుల విషయంలోనూ రహస్యాన్నే పాటించారు.

ఆదాయ పంపిణి విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధానాన్ని పాటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పేరాగ్రాప్‌ను కేటాయించినప్పటికీ, ఆదాయాన్ని ఎంత మొత్తంలో పంపిణీ చేయనున్నారన్నది పేర్కొనలేదు. సింగపూర్‌ సంస్థలు ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనల్లో ఎంత ఆదాయాన్ని కోరారన్నది బహిర్గత పరచలేదు.స్విస్‌ ఛాలెంజ్‌ అమలు చేసే సమయంలో అనుసరిచాల్సిన విధానాలపై సుప్రీంకోర్టు చేసిన సూచనలను కూడా రాష్ట్ర సర్కారు బేఖాతరు చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. సుప్రీం నిర్దేశాల్లో ముందుగా టెండర్‌ దాఖలుచేసిన సంస్థ పేర్కొన్న అన్ని వివరాలను తూచ తప్పకుండా వెల్లడించాలని తేల్చి చెప్పడాన్ని అత్యంత కీలకమైన అంశంగా నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు. అన్ని అంశాలను వెల్లడించడం ద్వారా తొలి ప్రతిపాదనలను ఛాలెంజ్‌ చేసే ఇతర సంస్థలు ఆలోచించుకునేందుకు అవకాశాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే తాజా ప్రతిపాదనల్లో ఆ స్పష్టత లేకపోవడం కోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని అంటున్నారు.. అలాగే సింగపూర్‌ సంస్థ సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన మొత్తం ప్రతిపాదనలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది.