అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రానికీ రాలేదేమో.

ఇప్పుడు కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ పట్ల దయచూపలేదు. కనీసం రాజ్యసభలో ఓటింగ్‌ జరగడానికి కూడా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వీలు లేకుండా చేసిందంటే, ఈ దుస్థితి గురించి ఇంకెంతగా వర్ణించినా ఏం లాభం? అర్థం పర్థం లేని ఓ చిన్న కారణంతో బిజెపి నాయకులు ఈ రోజు రాజ్యసభలో ప్రత్యేకహోదాపై ఓటింగ్‌ని అడ్డుకున్నారు. ‘మేం వ్యతిరేకం’ అని చెప్పి బిల్లు పాస్‌ అవకుండా చూసినా అది ఆ పార్టీ ధైర్యంగా తీసుకున్న నిర్ణయంగా భావించడానికి వీలుండేది. అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. పార్లమెంటు సాక్షిగా మోసపోవడం ఆంధ్రప్రదేశ్‌కి అలవాటైపోయింది. అందుకే మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ని జాలిగా చూస్తున్నాయి. పాలకులకు మాత్రం ఆ పాటి జాలి కలగడంలేదెందుకో!